కళాతపస్వి… ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ కన్నుమూశాడనే వార్త పొద్దుపొద్దునే అందరినీ కలిచివేసింది. సోషల్‌ మీడియాతో పాటు అన్నీ చానళ్లలో ఇదే వార్త. ఆయన తెలుగు సినీలోకానికి చేసిన సేవ, దర్శకత్వం వహించిన సినిమాలు, అవార్డులు, రివార్డులు.. ఆయన జీవిత చరిత్ర అన్నింటినీ పోటీలు పడి ఇస్తున్నారు. అంతా ఆసక్తిగా చూస్తున్నారు. పాత సినిమాలు, పాటలు చూసుకుంటూ ఆయన ప్రతిభను నెమరు వేసుకుంటున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని ఎంతో ఆవేదన పడిన సందర్భంలో .. అధికార పార్టీ కి చెందిన టీ న్యూస్‌లో మాత్రం వింత, విచిత్రం కనిపించింది.

ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది ఒకదారి అన్నట్టు … రోమ్‌ నగరం తగలబడుతుంటే పిడేలు వాయించుకుంటూ కూర్చున్నట్టు.. ఆ టీవీలో ఓ యాడ్‌ వస్తుంది. ఎప్పటిలాగే. అంతటి కమిట్‌మెంట్‌ ఆ చానల్‌ది. రుద్రాక్షలు ధరించే వచ్చే లాభాల గురించి లైవ్‌లో ఎంతో మందికి ఉపయోగపడే, జాతికి దోహదపడు మహాద్బుత లైవ్‌ కార్యక్రమాన్ని ఒకటి నిరాటంకంగా ప్రసారం చేస్తూనే ఉన్నారు. ఇది చూసి అంతా నోరెళ్లబెట్టారు. ఆ చానల్‌ను చూసే అక్కడో ఒక్కడో ఉండే ప్రేక్షకులు కొందరు. మీరు మారర్రా.. మారరంటూ వేరొక చానల్‌కు ట్యూన్‌ అయిపోయారు. ఏదో సినిమాలో బ్రహ్మానందం కామెడీ సీన్‌లో ఉన్నట్టు.. మేం ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాం.. మీరు మాత్రం అక్కడే ఉంటారు.. అన్నట్టుగానే ఉంది టీ న్యూస్‌ చానల్‌ దుస్థితి.ఇదీ పరిస్థితి.

You missed