తెలంగాణ వ‌చ్చిన కొత్త‌లో మీకంద‌రికీ గుర్తుండే ఉంటుంది. స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే అని కేసీఆర్ … ఒకే రోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కుటుంబాలు.. కులాలు, వృత్తులు.. ఆదాయాలు త‌దిత‌ర పూర్తి వివ‌రాలు తెలుసుకోవాల‌నుకున్నాడు. ముహూర్తం పెట్టాడు ఓ రోజు. అయితే అనూహ్యంగా ప్ర‌జ‌లు ఆ రోజు ప్ర‌వ‌ర్తించిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అప్ప‌టి వ‌ర‌కు క‌లిసి ఉన్న ఉమ్మ‌డి కుటుంబాలు విడిపోయాయి. ఎవ‌రి కుంప‌టి వాళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే… కొత్త తెలంగాణ రాష్ట్రంలో వ‌చ్చే ఫ‌లాలు, సంక్షేమ ప‌థ‌కాలు వేర్వేరుగా వ‌స్తే అంద‌రికీ ఎక్కువ మేలు జ‌రుగుతుంద‌ని. ఎవ‌రికి వారే పేర్లు న‌మోదు చేయించుకుంటే అంద‌రికీ ఎక్కువ ల‌బ్ది చేకూరుతుంద‌ని. ఆ త‌ర్వాత అంతా క‌లిసి ఉన్నారుకోండి అది వేరే విష‌యం.

ఇదెప్పుడు చెప్పాల్సి వ‌చ్చిందంటే.. రేపు జ‌ర‌గ‌బోయే మునుగోడు ఉప ఎన్నిక కోసం ఆ నియోజ‌వ‌క‌ర్గంలోని కుటుంబాలు విడిపోయాయి. పెద్ద‌ల‌దో పార్టీ. పిల్ల‌ల‌దో పార్టీ. పిల్ల‌లంటే ఓటు హ‌క్కు లేనోళ్లు కాదు.. ఆ కుటుంబంలోని కొడుకులు. మ‌ధ్య‌లో త‌ల్లులు ఏ వైపో తేల్చుకోలేక‌పోతున్నారు. ఆస‌రా పింఛ‌న్లు తీసుకుంటున్నారు కాబ‌ట్టి టీఆరెస్‌వైపే ఉన్నారు పెద్ద‌లంతా. అంతో ఇంతో రైతుబంధు విశ్వాసం కూడా ప‌ని చేస్తున్న‌ది. కానీ యూత్‌కు…. మాకేం వ‌చ్చింది. రాజ‌గోపాల్ రెడ్డి వైపే మేము.. అందుకే బీజేపీకే వేస్తాం. అంటున్నారు. పెద్ద‌లు చెబితే కూడా వినే ప‌రిస్థితి లేదు.

ఇంకొన్ని కుటుంబాల్లో మూడు పార్టీల‌వైపు ఉన్నారు. పెద్ద‌లు కాంగ్రెస్‌…పోర‌గాళ్ల‌లో బీజేపీ, టీఆరెస్‌… ఎవ‌రికి వారే డిసైడ్ అయ్యారు .. ఎవ‌రికి ఓటు వేయాలో. గ‌తంలో కుటుంబంలో అంతా ఒక్క తాటిపై ఉండేది. తండ్రులు చెబితే వినేది. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు. అది రాజ‌కీయ చైత‌న్యం అనాలో… అవ‌గాహ‌న రాహిత్యం అనాలో.. ప్ర‌లోభాల ప‌ర్వం అనాలో…ఆక‌ర్ష‌ణ అనాలో… మ‌ద్యం, డ‌బ్బు పంపిణీ ప్ర‌భావం అనాలో తెలియ‌దు. కానీ ఇదో విచిత్ర దోర‌ణి మాత్రం ఇక్క‌డ పురుడు పోసుకుంది. ఇక‌పై ఇలాంటివి మ‌నం చాలా చోట్ల చూడాల్సే వ‌స్తుంది.

 

You missed