కేసీఆర్ మాట‌లు చాలా సంద‌ర్భాల్లో మాట‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతాయి. లేస్తే మ‌నిషిని కాను టైపే ఉన్నాయి చాలా. కానీ అప్ప‌టి వ‌ర‌కు మాత్రం ఆ మాట‌ల తీవ్ర‌త బాగా ఉంటుంది. బాగా ప‌నిచేస్తుంది. సైనికుల‌ను యుధ్దానికి స‌న్న‌ద్దంచేస్తుంది. ఎటాక్ అంటే ఉరికేలాగా ఉసిగొల్పుతుంది. కానీ ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే అది చ‌ల్ల‌బ‌డుతుంది. మ‌ళ్లీ నిశ్శ‌బ్దం ఆవ‌హిస్తుంది. యుద్దానికి స‌న్న‌ద్ద‌మై వీర పోరాటం చేసేందుకు రెడీ అయిన సైనికుల్లో ఉత్సాహం మీద నీళ్లు చ‌ల్లిన‌ట్ట‌వుతుంది.

కానీ ఇప్పుడు టీఆరెస్ అధికార పార్టీ. రోడ్డెక్కి ధ‌ర్నా చేయాల్సి వ‌స్తుంద‌నే ఊహించ‌లేదు కావొచ్చు బ‌హుశా. మొత్తానికి మొత్తం అధికారం అంతా రోడ్డెక్కే సంద‌ర్భం. ఇది యాసంగి బియ్యం తెచ్చిన తంటా. మొన్న‌టికి మొన్న పోటాపోటీ ధ‌ర్నాలు చేశారు. కేసీఆర్ రెండు రోజులు వ‌రుస‌గా ప్రెస్ మీట్ పెట్టాడు. ఇక వ‌రుస‌గా వాయించేస్తా అన్నాడు. అంతా నిజ‌మే అనుకున్నారు. ష‌రా మామూలే. మ‌ళ్లీ ఎల్లుండి మ‌హాధ‌ర్నా అంటున్నాడు. కేంద్రం మెడ‌లు వంచి తీరుతాం. ఇది ఇక ఆరంభ‌మే.. మున్ముందు యుద్దం కొన‌సాగుతూనే ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు.

అర‌వీర భ‌యంక‌రంగా ఈ మ‌హాధ‌ర్నాను ప్ర‌క‌టించిన కేసీఆర్ నోటే.. భ‌యం వెంటాడే మాట‌లు.. ఉత్సాహాన్ని నీరుగార్చే ప్ర‌క‌ట‌న‌లు, వాస్త‌వాన్ని అంగీక‌రించి ఉన్న‌దున్న‌ట్టు మాట్లాడే స‌రికి .. అస‌లు మ‌హాధ‌ర్నా ఉద్దేశ్య‌మే ప‌క్క‌దారి ప‌ట్టింది. కేంద్రం మెడ‌లు వంచుతామంటాడు. కానీ వాళ్లు విన‌రంటాడు. వినేదాక వ‌ద‌ల‌నంటాడు.

ఇది కొన‌సాగుతూనే ఉంటుందంటాడు. కానీ వాళ్ల మాట‌లు విని మ‌నం న‌ష్ట‌పోవ‌ద్దంటాడు. కేంద్రం ఒక‌టి చెబితే.. ఇక్క‌డ బండి సంజ‌య్ అన‌వ‌స‌రంగా రెచ్చగొడుతున్నాడంటాడు. కేంద్రంతో లేఖ రాసుకొస్తావా? అని అడుగుతాడు. లేక‌పోతే ముక్కు నేల‌కు రాస్తావా..? అని నిల‌దీస్తాడు. ఆఖ‌రికి కేసీఆర్ రైతుల‌కు చెప్పిందేంటంటే..మేము ధ‌ర్నాలు చేస్తూనే ఉంటాం.. కానీ వాళ్లు విన‌రు.. మీరు మాత్రం వ‌రి వేసుకోకండి.. ప్ర‌త్యామ్నాయం వైపు పొండి అని.

మ‌హాధ‌ర్నా మ‌హా యుద్దానికి ముందే క‌త్తీడాలు వ‌దిలేశాడు కేసీఆర్‌.

బండి సంజ‌య్‌ను, రాష్ట్ర బీజేపీని చూసి భ‌య‌ప‌డి.. దాన్ని కంట్రోల్ చేసేందుకేనా ఈ ధ‌ర్నాలు..?

కేంద్రం క్లారిటీతోనే ఉంద‌ని చెబుతూనే.. ఈ ధ‌ర్నాల‌తో భ‌య‌ప‌డి కేంద్రం దిగివ‌చ్చి బండిని కంట్రోల్ చేసేందుకే గానీ, యాసంగి సీజ‌న్ బియ్యం మాత్రం కొన‌ద‌ని కేసీఆరే ప‌దే ప‌దే చెబుతున్నాడు.

ఈ మ‌హాధ‌ర్నాలు రైతుల కోసం కాదు.. యాసంగిలో వ‌రి వేసుకోమ‌ని భ‌రోసా ఇచ్చే ప‌రిస్తితి అస‌లే లేదు…

మ‌రెందుకు..? కేవ‌లం రాష్ట్ర బీజేపీని కంట్రోల్ చేయ‌డానికి. దోషిగా నిల‌బెట్ట‌డానికి. టీఆరెస్‌కు రైతులు దూరం కాకుండా ఉండ‌టానికి. అంతే.. అంతే.. అంతే…

రైతుల్లారా… మీరు మాత్రం యాసంగిలో వ‌రి వేయొద్దు.. ప్లీజ్‌.. ప్లీజ్‌.. ప్లీజ్‌……

You missed