ఇన్‌స్టాగ్రాం ద్వారా ప‌రిచ‌యం పెంచుకుని, స‌న్నిహితంగా మెలిగి ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసిన యువ‌కుడి పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. రిమాండ్‌కు త‌ర‌లించారు. విచార‌ణ నిమిత్తం క‌స్ట‌డీకి తీసుకున్నారు. విచార‌ణ కొన‌సాగుతుండ‌గానే అర్థ‌రాత్రి పోలీసుల క‌ళ్లుక‌ప్పి బేడీలు తెంచుకుని క‌స్ట‌డీ నుంచి ప‌రార‌య్యాడు. నిజామాబాద్ జిల్లా ఎడ‌ప‌ల్లి మండ‌ల పోలీసు స్టేష‌న్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. బోధ‌న్ మండ‌లం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన ఫిరాజి రాజు ఇన్‌స్టాగ్రాం ద్వారా ఎడ‌ప‌ల్లి మండ‌ల కేంద్రానికి చెందిన ఓ మైన‌ర్ బాలిక‌తో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. చ‌నువుగా ఉంటూ అస‌భ్య‌క‌ర‌మైన ఫోటోలు తీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటాన‌ని ఆ బాలిక త‌ల్లిని కూడా మాన‌సికంగా వేధించ‌డం మొద‌లుపెట్టాడు. ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చి హంగామా చేశాడు. పెళ్లి చేసుకోక‌పోతే ఫోటోలు బ‌య‌ట పెడ‌తాన‌ని బెదిరించాడు.

రాజు వేధింపులు భ‌రించ‌లేక ఆ బాలిక త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంతో కేసు న‌మోదు చేశారు. జ్యుడీషియ‌ల్ రిమాండ్ కు త‌ర‌లించిన పోలీసులు, విచార‌ణ నిమిత్తం ఈ నెల 18న పోలీసు క‌స్ట‌డీకి తీసుకున్నారు. అదే రోజు అర్థ‌రాత్రి చేతికి వేసిన బేడీల‌ను కిటికి ఊచ‌కు బంధించి పోలీసులు ప‌ట్టించుకోలేదు. ఇదే అదునుగా చూసిన నిందితుడు కిటికి ఊచ‌నుంచి బేడీల‌ను తెంచుకుని పారిపోయాడు. దీనిపై నిజామాబాద్ జిల్లా పోలీసు శాఖ‌లో క‌ల‌క‌లం రేగింది. యువకుడి కోసం బృందాలుగా ఏర్ప‌డి పోలీసులు గాలిస్తున్నారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హెడ్ కానిస్టేబుల్ వున్నాడు.

You missed