వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
అప్పుడెప్పుడో వచ్చిన శివమణి సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో హీరో నాగార్జున పోలీస్ ఆఫీసర్. నా పేరు శివమణి. నేనింతే. మీరు తీరు మార్చుకోండి. లేకపోతే నేనే మారుస్తా.. రౌడీయిజం.. గుండాయిజం మానుకోండి. తాట తీస్తా.. అంటూ చెప్పే డైలాగులు చాల ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు అదే రేంజ్‌లో జిల్లాలోని రౌడీ షీటర్లకు వార్నింగ్ ఇచ్చాడు సీపీ కల్మేశ్వర్ సింగెనివార్. ఈ సీపీ స్టైలే వేరు. జిల్లాకు సీపీగా వచ్చిన నాటి నుంచి ఆయన తనదైన రీతిలో కఠినంగా ఉంటూ వస్తున్నారు. ఎవరు ఎలాంటి నేరాలకు పాల్పడిన వెంటనే యాక్షన్ తీసుకోవడం ఈయన స్టైల్. ఇప్పటి వరకు ఎవరూ జోలికి పోని వీడీసీపైనా కొరఢా ఝుళిపించారీయన.
తాజాగా ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కాడు సీపీ కల్మేశ్వర్. శనివారం జిల్లాలో ఉన్న రౌడీ షీటర్లందరినీ పిలిపించాడు. దీనికి రౌడీ షీటర్ల మేళా అని ముద్తుగా పేరు కూడా పెట్టాడు. నేరుగా వారికి మాస్ వార్నింగ్ ఇచ్చాడు శివమణి లెవల్లో. తీరు మార్చుకోకపోతే తాట తీస్తాననే విధంగా హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాదు.. మీరెటు పోతున్నారో… ఎవరిని కలుస్తున్నారో అంతా తెలుసునన్నాడు. ఇకపై మీ ఆటలు సాగాయి. ఇప్పుడిక తోక ముడుచుకుని గప్‌చుప్‌గా మీ పనులు చేసుకోండి.. లేకపోతే తగుదునమ్మా అని దాంట్లో దీంట్లో వేలు పెడితే పీడీ యాక్ట్ పెట్టి బొక్కలో తోస్తానన్నాడు.
అలా ఆ రౌడీ షీటర్లంతా సీపీ వార్నింగ్‌కు గజగజా వణికిపోతూ చేతులు కట్టుకుని చెమటలు కక్కుతూ నిలుచుని సైలెంట్ విని తలాడించి పోయారు. మొన్నీమధ్య అర్ధరాత్రి హల్‌చల్ చేశాడు సీపీ. ఒక్కడే రోడ్డుపైకి వచ్చాడు. తారసపడిన అల్లరి మూకలకు ఎదురొచ్చి లాఠీ చూపించాడు. నేరం ఎవరు చూసిన యాక్షన్‌లోకి దిగిపోవడం ఈ సీపీ స్టైల్.