వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌:

 

ఒక్కగానొక్క కొడుకు. ఆశలన్నీ కుమారుడిపైనే. కానీ తనకు ఇష్టం లేని ప్రేమపెళ్లి చేసుకోవాలనుకున్నాడు అతను. ఇది ఆ తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. వద్దన్నాడు. కులాంతర వివాహానికి అతని మనసు ఏమాత్రం అంగీకరించలేదు. కానీ అందరూ బలవంతం చేశారు. ఇక తప్పదన్నట్టు బలవంతంగానే ఒప్పుకున్నాడు. రేపే నిశ్చితార్థం. ఇక పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి. కానీ ఆ తండ్రి మనసెందుకో ఇంకా కుదటపడలేదు. మరింత ఒత్తిడికి గురయ్యింది. ఎవరితో చెప్పుకోలేని మానసిక వేదన. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి. సమాజంలో తన పేరు పలుకుబడి ఏమవుతాయననే ఆలోచనలు అతన్ని ఊపిరిసలపనీయలేదు. ఉక్కిరిబిక్కి చేశాయి. చివరకు ఊపిరినీ తీసుకోవాలనుకున్నాడు. బలవన్మరణానికి సిద్దపడ్డాడు.

డీఆర్డీఏలో అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పనిచేస్తున్న సంజీవరావు ఆత్మహత్యకు ఇదే కారణమంటున్నారు బంధువులు. ఎలాంటి సమస్యలు లేవు. ఆఫీసులో ఇబ్బందులు లేవు. అందరితో కలుపుగోలుగా ఉంటాడు. కానీ గత కొంతకాలంగా అతని మనసులో ఇదే గాయం ఇబ్బంది పెడుతుందని, అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదని ఎవరికి తెలియదు. ఎవరితో తన బాధను కూడా అతను పంచుకోవడానికి ఇష్టపడలేదు. చివరకు ఆత్మహత్యకు పాల్పడి తోటి ఉద్యోగులను షాక్‌కు గురి చేశాడు సంజీవ్‌. అతని ఆత్మహత్యతో కలెక్టరేట్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన చావుకు కారణం ఇదని సంజీవ్‌ తన ఊపిరి తీసుకునే ముందు కూడా ఎలాంటి నోట్‌ రాయకుండానే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు.

You missed