దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం సిగ్గుపడేలా భార్యభర్తలను బట్టలూడదీసి గాంధీ విగ్రహానికి కట్టేసి చితకబాదిన సంఘటన వెలుగు చూసింది. పోలీసులు ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నా.. అది మా పరిధి కాదంటే మా పరిధి కాదని చేతులెత్తేసిన వైనం పోలీస్‌ వ్యవస్థ తీరును పట్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మాచారెడ్డి మండంలోని అక్కాపూర్‌కు చెందిన సందాని నరేశ్‌ (27) తన మొదటి భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల ఓ దళిత మహిళను రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కూలీనాలి చేసుకుంటూ బతుకుతున్నారు. కాగా మొదటి భార్య తరపున వాళ్లు ఉన్నపళంగా వీరిద్దరిపై బుధవారం రాత్రి దాడి చేశారు. ఇద్దరి బట్టలూడదీశారు.

బరిబాతల ఆ ఊరి గాంధీ విగ్రహం ముందు రాత్రంతా కట్టేసి ఉంచారు. కారం చల్లారు. వీరిని ఎవరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. తెల్లవారుఝామున అటుగా వెళ్లున్న పాలు విక్రయించే కొందరు వీరిని గమనించి కట్లు విప్పదీశారు. ఆ తరువాత ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఇది మా పరిధి కాదని మాచారెడ్డి పోలీసులు… మా పరిధి కాదని రామారెడ్డి పోలీసులు ఒకరిపై ఒకరు నెట్టేసుకుని కేసు మాత్రం పెట్టలేదు. ఈ విషయం ఆలస్యంగా మీడియాకు తెలిసింది. ఈ పైశాచికత్వానికి పాలుపడిన వారి పేర్లను కూడా పోలీసులు కనిపెట్టారు. కానీ కేసులు మాత్రం పెట్టలేదు.

You missed