గాంధీ ఆసుప్రతి రేడియోగ్రాఫర్.. ఉమా మహేశ్వర్. గాంధీ ఆసుప్రతిలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగి తరపు బంధువు. ఇద్దరు అక్కా చెళ్లెల్లను రేప్ చేశాడనే ఆరోపణలతో ఒక్కసారిగా ఇతను రేపిస్టుగా ప్రపంచానికి పరిచమయ్యాడు. కొన్ని పేపర్లలో ఫోటో కూడా వేశారు కష్టపడి సంపాదించి. ఉమా మహేశ్వర్‌ను ప్రపంచం బండబూతులు తిట్టింది. శాపనార్ధాలు పెట్టింది. వీడిని ‘ఎన్ కౌంటర్’ చేయాలని కూడా చాలా మంది డిమాండ్ చేశారు. చేస్తే ఆ ఉద్వేగ మనస్సులు శాంతించేవేమో! అంతలా రగిలిపోయారు. పరిస్థితి అలాంటిది. దిక్కుమొక్కు లేని అక్కా చెళ్లెళ్లను బంధుత్వం పేరుతో వంచించి రేప్ చేసిన ఈ రేపిస్టు ఉమా మహేశ్వర్ ముఖం మీద యావత్ సమాజం ఉమ్మివేసింది. అనుకోకుండా తను రేపిస్టుగా ముద్రపడి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మూడు రాత్రులు పోలీసులు చేతిలో నరకం అనుభవించాడు. పోలీసులు ఇంటరాగేషన్ కన్నా మీడియా అతని పై చేసిన ‘రేప్’ .. వేసిన ‘రేపిస్టు’ ముద్ర మానసికంగా అతన్ని అప్పుడే చంపేసింది.
నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. ఇక్కడ పెద్దగా సమయం పట్టలేదు. సీసీ కెమెరా పుటేజీలు నిజాలను నిగ్గు తేల్చాయి. కనీసం ఎవరూ ఊహించని పరిణామాలు తెలియజెప్పాయి. మందు కల్లుకు బానిసకావడంతోనే ఇలా జరిగిందని, రేప్ అసలే జరగలేదనేది తొందరలోనే తెలిసిపోయింది. కానీ ఉమా మహేశ్వర్ భార్యకు మొదటి నుంచి భర్త మీద నమ్మకం సడలలేదు. ఇన్నేళ్ల వివాహబంధంలో ఒకరిపై ఒకరు పెట్టుకున్న నమ్మకం ఎక్కడా సన్నగిల్లలేదు. పోలీసుల వద్దకు వచ్చి ఆ భార్య పోరాటం చేసింది. ‘తన భర్త అలాంటి వాడు కాదని’. కానీ ఎవరూ నమ్మలేదు. బంధువులంతా దూరమై అందరికీ నమ్మకం పోయి రేపిస్టుగా ముద్రపడిపోయిన ఉమా మహేశ్వర్‌ను భార్య మాత్రం ఇసుమంత కూడా అనుమాననించలేదు. మీడియా ‘రేప్’ చేసి అతన్ని మానసికంగా చంపేసినా.. ఎక్కడా అతను మీడియాను తప్పుబట్టలేదు. నిర్ధోషిగా పోలీసుల చేతిలో బయటపడి ఊపిరిపీల్చుకున్నాడు. ఇప్పుడు ఉమా మహేశ్వర్‌కు ఇది కొత్త జీవితమే.
‘సహాయం చేస్తే ఇలా చేస్తారా?’ అని అమాయకంగా ఆయన వేసిన ప్రశ్న… ‘ఇంకెవరికీ సాయం చేయొద్దనే’ భావనను పలికించడం … మీడియా సాధించిన గొప్ప విజయాల్లో ఇదీ ఒకటి.
