ఆడ‌పిల్ల‌ల‌ను క‌న్న త‌ల్లిదండ్రులు వారిని ఇప్ప‌టికీ గుండెల మీద కుంప‌టిలాగే భావిస్తున్నారు. చాలా మంది ఆడ‌పిల్ల‌ల పెంప‌కంలో ఇంకా వివ‌క్ష చూపుతున్నారు. మ‌గ‌పిల్ల‌ల‌తో స‌మానంగా వారిని తీర్చిదిద్దాల‌నే ఆలోచ‌న అంద‌రిలో లేదు. చ‌ద‌వు విష‌యంలో కూడా అంతే. ఏదో కొద్దిపాటి చ‌దువులు. తోడ‌బుట్టినోడితో స‌మానంగా చ‌దివే అవ‌కాశం ఉన్న ఆడ‌పిల్ల‌లు ఎంత మంది? ఇంకా బాల్య‌వివాహాలు జ‌రుగుతూనే ఉన్నాయి చాలా ప‌ల్లెల్లో. చిన్న‌వ‌య‌స్సులోనే పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగ‌నంపి బ‌రువు దించుకునే ప్ర‌య‌త్నాలే చాలా మంది చేస్తున్నారు. ఏళ్లు గ‌డిచినా.. ఆడ‌పిల్ల‌ల పెంప‌కంలో వివ‌క్ష నేటికీ కొన‌సాగుతూనే ఉంది. చ‌దువుకుని ఏం చేస్తావ‌మ్మా? అత్తారింటికి పోయి .. ఇంటి ప‌ని వంట ప‌ని చేసుకోవాల్సిందే క‌దా..! అని త‌ల్లే స్వ‌యంగా త‌న బిడ్డ చదువుకు ఆటంకంగా మారుతున్న ప‌రిస్థితి ఇంకా ఉంది. పెద్ద‌గా ఏమీ మార‌లేదు.

పట్ట‌ణాల్లో కంటే ప‌ల్లెల్లో అమ్మాయిల ప‌రిస్థితి పెద్ద‌గా మార‌లేదు. సంప్రదాయం, క‌ట్టుబాట్ల పేరుతో చిన్న‌ప్పుడే వివాహం చేసి పంపే రోజులు ఇంకా అలాగే ఉన్నాయి. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా ప‌ద‌ర మండ‌లం వంకేశ్వ‌రంలో ఇంట‌ర్ పూర్తియిన అమ్మాయి త‌నకు చ‌దువుకోవాల‌ని ఉంద‌ని పెళ్లి పీట‌ల మీదే పెళ్లి చేసుకోవ‌డానికి తిర‌స్కరించింది. చ‌దువుకునే విష‌యంలో అమ్మాయిల ప‌ట్ల త‌ల్లిదండ్రులు చూపుతున్న వివ‌క్ష‌, తొంద‌ర‌గా పెండ్లి చేసి భారం దించుకోవాల‌ని చూసే వారి మార‌ని మ‌న‌స్త‌త్వాల‌కు ఈ సంఘ‌ట‌న అద్దం ప‌డుతుంది. వంకేశ్వ‌రం వ‌ధువు చూపించిన తెగువ ఎంత మంది అమ్మాయిలు చూప‌గ‌ల‌రు? త‌ల్లిదండ్రుల నిర్ణ‌యాల‌ను ధిక్క‌రించి తాము అనుకున్న ల‌క్ష్యాల‌ను ఎంత మందిచేరుకోగ‌ల‌రు? ఉన్నత చ‌దువుల కోసం అడుగ‌డుగునా ఆటంకాలే సృష్టిస్తున్న స‌మాజంలో, కుటుంబాల్లో ఎలా ఎదురీద‌గ‌ల‌రు?

You missed