రేష‌న్‌కార్డుల కోసం ద‌ర‌ఖాస్తులు ఇంకా వెల్లువ‌లా వ‌చ్చి ప‌డుతూనే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశాన్ని ఎప్పుడో నిలిపివేశారు. రెండేండ్ల కింద‌టి ద‌రఖాస్తుల‌కు హుజురాబాద్ ఉప ఎన్నిక‌ను దృష్టిలో పెట్టుకొని హ‌డావిడి ఎంక్వైరీ చేసి కొత్త‌విచ్చేశారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అవి కార్డులుగా మాత్రం రాలేదు. కేవ‌లం అవి ప్రింట్లు మాత్ర‌మే. ఆ కాగితాల‌తోనే రేష‌న్ దుకాణాల‌కు పోయి.. బియ్యం తెచ్చుకుంటున్నారు. ఆ బియ్యం త‌ప్పితే ఆ దుకాణాల్లో ఇంకా ఇవ్వ‌డం లేదు. ఒక‌ప్పుడు ప‌ప్పులు, పామాయిల్‌, చ‌క్కెర‌.. ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యం కోస‌మే ఆ కార్డులున్నాయి. అయితే చాలా మంది ఈ దొడ్డు బియ్యం తిన‌డానికి ఇష్ట‌ప‌డటం లేదు. కానీ కార్డులు మాత్రం ఉంటున్నాయి. వాటిని తెచ్చుకొని అమ్ముకుంటున్న‌వాళ్లు కూడా ఉన్నారు. రేష‌న్ దుకాణ‌దారులే కొంత మంది ద‌గ్గ‌ర కేజీకి ఐదు రూపాయ‌ల చొప్పున తీసుకొని బ‌హిరంగ మార్కెట్లో 12 నుంచి 15 రూపాయ‌ల వ‌ర‌కు అమ్ముకుంటున్నారు. కానీ కార్డులు మాత్రం వ‌ద‌ల‌డం లేదు వీరు. ఇంకా కొత్తవి వ‌స్తున్నాయి. స‌రిగ్గా నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎంక్వైరీ చేస్తే 40 శాతం బోగ‌స్ కార్డులున్న‌ట్లు తేలుతాయి. వాటిని తీసేయ‌లేదు. కొత్తవి ఇచ్చేందుకు సాహించ‌డం లేదు. ఇంకా చాలా పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్ప‌టికీ కొత్త‌గా ఆన్‌లైన్ అవ‌కాశం ఇస్తే మ‌ళ్లీ ల‌క్ష‌ల్లో ద‌ర‌ఖాస్తులు వ‌చ్చి ప‌డ‌తాయి.

ఎందుకు ఈ రేష‌న్‌కార్డు కోసం ఇంత‌లా ప‌రుగులు తీస్తున్నారు.??

ఈ రేష‌న్‌కార్డును ప్ర‌భుత్వాలు పేదోడిగా గుర్తించే ఓ గుర్తింపు కార్డుగా ప‌రిగ‌ణిస్తూ వ‌చ్చింది. దాదాపు అన్ని ప్ర‌భుత్వ స్కీంలకు అర్హులు కావాలంటే ఇది ఉండాల్సిందే. ఆరోగ్య శ్రీ నుంచి మొద‌లుకొని డ‌బుల్‌బెడ్ రూం ఇండ్లు, క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, పింఛ‌న్లు.. ఇలా ఏ ప‌థ‌కం తీ

సుకున్నా .. ముందు అడిగేది రేష‌న్‌కార్డు. అదుంటే దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలుగా ప్ర‌భుత్వం లెక్క‌లోకి తీసుకుంటుంది. అందుకే దీన్ని సంపాదించేందుకు లంచాలు ఇచ్చి మ‌రీ పొందిన వారున్నారు. కార్లున్న‌వారికీ , పెద్ద పెద్ద బిల్డింగులున్న వాళ్ల‌కు కూడా రేష‌న్‌కార్డులున్నాయి. ఇవ‌న్నీ ప్ర‌భుత్వ స్కీంల కోస‌మే పెట్టుకున్నారు.
తొల‌త ప్ర‌భుత్వం ఈ వైఖ‌రి మార్చేందుకు నిబంధ‌న‌లు స‌డ‌లించామ‌ని, రేష‌న్ కార్డు కేవ‌లం బియ్యం తీసుకోవ‌డానికేన‌ని ఆహార భ‌ద్ర‌త‌కేన‌ని చెప్పింది. ప్ర‌క‌ట‌న‌లిచ్చింది. కానీ ఎవ‌రూ న‌మ్మ‌లే. కొత్త కార్డు కోసం ప‌రుగులు పెట్ట‌డం ఆప‌లేదు. పాత‌వి తీసేసేందుకూ స‌ర్కార్ సాహ‌సించ‌లేదు.

ఇలా ప్ర‌తీ ఏటా కొత్త ద‌ర‌ఖాస్తులు వ‌చ్చి ప‌డుతూనే ఉంటాయి. ఎన్నిక‌లు రాగానే ప్ర‌భుత్వం వాటికి మోక్షం క‌ల్పిస్తూ ఉంటుంది. వాటాని ద‌గ్గ‌ర పెట్టుకొని మ‌న‌వాళ్లు ఇక అన్ని సంక్షేమ ప‌థ‌కాలు మా ద‌రి చేరిన‌ట్టేన‌ని సంబుర‌ప‌డుతూ బ‌తుకుతుంటారు. అంతే.

You missed