వాస్తవం ప్రధాన ప్రతినిధి- నిజామాబాద్‌:

ఒట్టేసి చెబుతున్నా అని రేవంత్‌ ఓట్ల కోసం ఒట్ల రాజకీయానికి తెరలేపాడు. దేవుళ్ల పేరు చెప్పి రాజకీయం చేయొద్దని సుద్దులు చెబుతాడు. అందరికీ దేవుడుంటాడు. రాజకీయాల్లో దేవుడి ప్రస్తావన ఎందుకంటాడు..? నీతులు, సుద్దులు చెప్పిన మన సీఎంగారే ఇప్పుడు ఏడ ఏ మీటింగుకు పోయినా.. ఆ దేవుని మీదొట్టు.. ఈ దేవునిమీదొట్టు.. నన్ను నమ్మండి ప్లీజ్‌..! అనే రేంజ్‌లో బతిమాలుకుంటున్నాడు.

ఎందుకో తెలుసా..? రుణమాఫీ గురించి. రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానన్నాడు కదా. అదిప్పట్లో అయ్యేలా లేదు. ఎప్పుడుచేస్తారో వారికే తెలియదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతలా దివాళా తీసి ఉంది మరి. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ. ఎలా తప్పించుకోవాలి. ఎలా నమ్మించాలి. ఎలా ఓట్లు రాబట్టాలి…? ఇదే కదా ప్రభుత్వానికి అసలు సవాలు. అందుకే ఇప్పుడు ఎక్కడ ఏ మీటింగు పెట్టినా.. ఆ జిల్లాలో ఫేమస్‌ దేవుడి పేరు చెప్పి ఆ దేవుడి మీద ఒట్టు.. ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీ చేస్తా అని నమ్మబలుకుతున్నాడు. ఇలా అన్నాడంటేనే ప్రజలు సీఎం మాటల మీద విశ్వాసం కోల్పోయారని చెప్పకనే ఒప్పుకున్నట్టే కదా.

అవును..! ఎందుకు ఆగస్టు పదిహేను దాకా.. ఎన్నికలు అయిపోగానే చెయ్యొచ్చు కదా..? అని ఎవరికైనా అడగాలనిపిస్తది. కడిగేయాలని కూడా అనిపిస్తది. కానీ ఇంకా మున్ముందు చిన్న చిన్న ఎన్నికలు బాకీ ఉన్నాయి కదా. అవన్నింకీ ఇలా ఒట్లు పెట్టుకుంటూనే ఓట్లు రాబట్టుకుంటూనే తతంగతమంతా ఒడిసినంకా.. అప్పుడు ఖజనా గురించి నయా కహాని వినిపిస్తాడు. లేదంటే మమ్మల్ని గెలిపియ్యమంటే గెలిపియ్యలే కదా.. అనుభవించండి.. అని కూడా అనే ప్రమాదమూ ఉందండోయ్‌.. దానికీ ప్రిపేరయిపోండి ఇప్పట్నుంచి. పెద్దగా బాధపడే పరిస్థితి ఉండదు.

 

You missed