దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
ఇద్దరూ ఇద్దరే.. హామీలివ్వడంలో, అబద్దాలు చెప్పడంలో ..! ఔను… ఒకరేమో మాజీ సీఎం కేసీఆర్, ఇంకొకరు తాజా సీఎం రేవంత్‌రెడ్డి. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రయ్యేందుకు చాలానే హామీలిచ్చాడు. అవన్నీ అమలు కాలేదు. పేదలకు వరంలాంటి డబుల్ బెడ్ రూమ్ పథకమైతే అట్టర్ ఫ్లాప్. నిరుద్యోగభృతి, దళితులకు మూడెకరాలు లాంటి స్కీములు అమలుకు నోచుకోలేదు. దళితబందు అనేది కేవలం తన జాతీయ రాజకీయాల ఎంట్రీ కోసం వాడుకున్న పథకం. ఇది అమలైంది లేదు.. ఇచ్చిందీ లేదు.
రైతుబంధు పేర బడాభూస్వాములకు పేదల పైసలు దోచిపెట్టాడు కేసీఆర్. ఇలా చాలా లోపాలున్నాయి. కేసీఆర్‌వి ఫక్తు ఓటుబ్యాంకు రాజకీయాలు. ఆయనే అన్నాడు తనది ఫక్తు రాజకీయ పార్టీ అని. ఇప్పడు రేవంత్ వంతు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసి ఉన్నదని కాంగ్రెస్ నేతలకు, రేవంత్‌కు తెలుసు. కానీ అలవిమాలిన హామీలిచ్చారు. అధికారంలోకి రావడమే పరమావధిగా మ్యానిఫెస్టోతో జనాలను ఆకర్షించారు. కేసీఆర్ అంటే వ్యతిరేకత పెరగడమూ కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. అది వేరే టాపిక్. తాజాగా పార్లమెంటు ఎన్నికల వేళ ఇద్దరూ ప్రచారంలో దిగారు.
బుధవారం నుంచి బస్సుయాత్ర పేర కేసీఆర్ తన ప్రచారం షురూ చేశాడు. ఆయన మాటలన్నీ రొటీనే గానీ కొత్తగా ఓ మాటన్నాడు. బీఆరెస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను మెడలు వంచి అమలు చేపిస్తామని. ఈ 420 హామీల మాట ఉత్తదే. పచ్చి అబద్దం. అంతకు ముందు కేటీఆర్ కూడా దీనిపై ఓ బుక్‌లెట్ తీసుకొచ్చి ప్రచారం చేసిన జనం నుంచి స్పందన రాలేదు. ఎవరూ పట్టించుకోలేదు. సరే అన్ని హామీలు లేకున్నా ఇంకా చాలా హామీలే అమలు చేయాలి కాంగ్రెస్. అవి అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆరెస్‌ది. కేసీఆర్‌దే. దీనికి సీట్ల గెలుపుకు లంకె పెట్టడం పక్కా రాజకీయమే. జనాన్ని తప్పుదోవ పట్టించడమే (వీళ్లు చెబితే ప్రజలు తప్పుదోవ పడతారని భావించడం వారి భ్రమ).
ఇక రేవంత్ అంటాడు.. 14 సీట్లు గెలిపించి ఇస్తే ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని, ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు చేయాలంటే కాంగ్రెస్ గెలుపు అనివార్యమని..! మీ గెలుపులతో జనాలకే సంబంధం లేదు. నచ్చినోళ్లకు వేస్తారు. మీ ఈ ‘షరతులు వర్తిసాయి’ అనే డైలాగులే మీ రాజకీయ దివాళకోరుతనాన్ని పట్టిస్తున్నది. నీ పద్నాలుగు సీట్లకు ముదిరాజుల మంత్రి పదవికి సంబంధం ఏందీ.. బీసీల్లో అణగారిన వర్గాల్లో వారికి కచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని ధైర్యంగా చెప్పలేవా..? ఆ ఆశలు పెట్టుడేందీ..? మోచేతికి బెల్లం పెట్టుడేందీ..? కేసీఆర్ రెండాకులు చదివితే ఈ విషయంలో రేవంత్ నాలుగు ఆకులు చదివాడు. ఇప్పుడు రుణమాఫీ లొల్లి నడుస్తోంది.
పంద్రాగస్టు డెడ్‌లైన్ పెట్టుకున్నాడు రేవంత్. కానే కాదంటాడు హరీశ్. చేసిచూపుతా రాజీనామాకు సిద్దపడు అని సవాల్ విసిరాడు రేవంత్. నేను రెడీ అని సవాల్ స్వీకరించాడు హరీశ్..! ఎన్నికల వేళ మరోసారి ప్రజల చెవిలో పువ్వులు పెట్టడమే తప్ప ఇది అయ్యేదికాదు పొయ్యేదీ కాదు. లక్ష రూపాయల రుణమాఫీకే కేసీఆర్ కిందామీద పడి సాధ్యం కాక చేతులెత్తేసి రైతుల చేతుల్లో చావు దెబ్బ తిన్నాడు. మరి నీ రెండు లక్షల హామీ అంతా వీజీనా రేవంత్. అంతుకు ముందు నువ్వు చేయాల్సింది .. నాలుగు వేల పింఛన్ పెంపు, ఇందిరమ్మ ఇళ్ల పేర ఇచ్చే ఐదు లక్షల స్కీమ్.. ఈరెండు అమలు చేసి చూపు.. నీ భాషలో చెప్పాలంటే నువ్వు మొగోనివని అప్పుడనుకుంటారు జనాలు.