దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

కేసీఆర్‌ వ్యూహం మార్చాడు. బీజేపీ పల్లవి అందుకున్నాడు. కాంగ్రెస్‌ను దెబ్బ తీసి బీజేపీని బతికించే వ్యూహాన్ని బాహాటంగానే ప్రకటించేశాడు. తాజాగా ఆయన సంగారెడ్డిలో జరిగిన సభలో మాట్లాడిన తీరు.. ఆయనలో మారిన మనిషి, అవసరాల రీత్యా రాజకీయ సిద్దాంతాలను మార్చుకున్న విధానం బయటపడింది. కవిత అరెస్టు తరువాత కేసీఆర్‌ తన స్ట్రాటజీ మార్చకున్నాడు. ఇప్పుడప్పుడే బీఆరెస్‌ లేచే పరిస్థితి లేదు ఉన్న వాళ్లంతా జంప్‌ అయిన తరువాత .. పార్టీకి పూర్వవైభవం ఇప్పట్లో రావడం అసంభవం. ఆ విషయం కేసీఆర్‌కు తెలుసు. అందుకే కాంగ్రెస్‌ను బొంద పెట్టాలనే ఆయన తాజా వ్యూహానికి పదును పెట్టాడు.

సీఎం రేవంత్‌ బీజేపీలో చేరుతాడని మామూలుగా సాధారణ నేతలు మాట్లాడే పసలేని మాటలు మాట్లాడి పలుచనయ్యాడు. ఒక సంవత్సరం పాటే ప్రభుత్వం ఉంటుందని మరి దిగజారి మాట్లాడటం వెనుక తన పార్టీని బతికించుకోవడం ఒక వ్యూహం అయితే ఈ పార్లమెంటులో కాంగ్రెస్‌కు ఓటేస్తే వేస్ట్‌… బీజేపీకి వేయండని పరోక్షంగా తన వంతుగా ఓటర్లకు విజ్ఞప్తి చేయడమేనని అనుకోవచ్చు. కాంగ్రెస్‌కు రెండు సీట్లు కూడా రావన్నాడు.

బీఆరెస్‌కు ఒక్క సీటు కూడా రాదు ఆ విసయంలో కేసీఆర్‌ మంచి క్లారిటీ ఉంది. మరి కాంగ్రెస్‌కు రెండు సీట్లు కూడా రాకపోతే… మిగిలిన సీట్లు బీజేపీకి వస్తాయా..? బీజేపీకే ఇవన్నీ సీట్లు రావాలని కేసీఆర్‌ బలంగా కోరుకుంటున్నాడా..? ఇప్పుడు తన రాజకీయ అవసరాలకు బీజేపీని బలపర్చడం కేసీఆర్‌కు తప్పనిసరి అయ్యిందా..? మళ్లీ మోడీని పీఎం చేస్తేనే తప్ప తనకు, తన కుటుంబానికి, పార్టీకి మనుగడ లేదని డిసైడ్‌ అయిపోయాడా..? ఎక్కడ కేసీఆర్‌.. ఎంతటి మాటల కోటలు దాటిన కేసీఆర్.. ఇప్పుడు మోడీ కాళ్ల బేరానికి వచ్చినట్టు లేదు.

దేశాన్నే గడగడ లాడిస్తానని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి .. బీఆరెస్‌ పార్టీ పెట్టి దేశానికి కాబోయే పీఎం తానేనని మేకపోతు గాంభీర్యాలు పలికిన కేసీఆర్.. ఇప్పుడు రాష్ట్రంలోనే తన పార్టీని దివాళా తీయించి.. తన అహంకార పాలనతో బిడ్డ కవితను జైలు పాలు చేపించి.. ఆమెను విడిపించుకునేందుకు ఇలా పార్టీ సిద్దాంతాలు, గతంలో వల్లించిన నీతులు, సూత్రాలు అన్నీ పక్కన బెట్టి కాంగ్రెస్‌ను బొంద పెట్టే మాటలకు దిగాడు. కానీ కేసీఆర్‌ మాటలు వినే పరిస్థితుల్లో జనాలు ఉన్నారా..? ఆయన మాటలు నమ్ముతారా..? ఆ పార్టీని బతికించేంతగా ప్రజల్లో సానుభూతి ఏమైనా వచ్చిందా..? అన్నింటికీ ఇప్పటి వరకైతే నో అనే ఆన్సరే వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed