దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
అదో టీవీ లైవ్ షో..! ఏదో చెప్తాడనుకున్నారు. ఊదరగొట్టారు. అందులో విషయమమీలేదు. విశేషమంతకన్నా లేదు. ఓడిన తరువాత మాట్లాడిన అవే మాటలు ఇక్కడ గంటల తరబడి మాట్లాడాడు. ప్రశ్న వేసే వాడు ముందే ఏం అడగాలో .. తను ఏం చెప్పాలో స్క్రీన్ ప్లే పక్కాగా రాసుకుని వచ్చినట్టుగా నడిచింది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఉట్టి బోగస్ అన్న కేసీఆర్.. మరి కవితను కాకుండా కేటీఆర్‌ను ఇందులో మోడీ ఇరికించొచ్చు కదా..! లాజిక్ మిస్ అయ్యాడు. గతంలో లాగా ఏది చెబితే అది నమ్మేయడానికి జనాలు సిద్దంగా లేరు. ఆ విషయం కేసీఆర్ ఇంకా గ్రహించలేదు. నేల దిగిరాలేదు. కళ్లు నెత్తినే ఉన్నాయి. అహంకారమూ వీడలేదు. తన పార్టీని వీడిన వారికి మాత్రం రాజకీయ సమాధి అంటూ పిల్లి శాపాలు పెట్టాడు.
ఎందుకు వీడారో ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు కేసీఆర్. పదేండ్లు కేసీఆర్‌కు అధికారం ఇస్తే ఎమ్మెల్యేలు, సీఎంగా కేసీఆర్… మంత్రులుగా నేతలు ఏం చేశారో ప్రజలు చూశాడు. నాయకులు విసిగిపోయారు. అందుకే నెల రోజులు కూడా పార్టీని పట్టుకుని ఉండలేకపోయారు. అంతలా విసిగెత్తేలా చేసింది… కేసీఆర్.. ఆ పార్టీ నేతలే..! ఇంత జరిగినా కేసీఆర్‌లో అదే మేకపోతు గాంభీర్యం కనిపించింది. మాయ మాటలు నమ్మారని ప్రజలనే మళ్లీ టార్గెట్ చేశాడు కేసీఆర్. అప్పులపై తనదైన శైలిలో సమర్థించుకున్నాడు. అప్పుల కుప్పగా మారిస్తేనే నెంబర్‌వన్‌లో ఉంటామని అమెరికాను ప్రస్తావించాడు.
తను గీతోపదేశం చేస్తుంటే.. ప్రశ్నలు సంధించాల్సిన ఆ యాంకరు పాఠాలు వింటున్న చిన్నపిల్లాడిలా చేతులు కట్టుకుని విన్నాడు. జనాలు కూడా బహుశా అలాగే ఎగబడి ఎగబడి చూసుంటారని కేసీఆర్ భ్రమ. ఫోన్ ట్యాపింగ్ పక్కాగా తను చేయించిందేనని కేసీఆర్ తడబాటు తత్తరపాటు మాటలు చూస్తేనే అర్థమయ్యింది. దీనికి మళ్లీ సమర్థింపు. మేళవింపు. బ్రిటిష్ కాలం నాటి గూఢచార వ్యవస్థ, చట్టం .. ఏవేవో వల్లెవేశాడు. ఎంత భ్రమలో, అభద్రభావంలో, అహంకారంతో పాలన చేశాడో కేసీఆర్ ఈ టీవీ చానెల్ వేదికగా మారోసారి నిరూపించుకుని, గులాబీల్లో మాత్రం నేనే సీఎం.. మళ్లీ మేమే.. వస్తాం, సాధిస్తాం అనే మాటలతో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు.