దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

కేసీఆర్‌ అంటే అంతే. అవసరముంటే నెత్తికెత్తుకుంటాడు. అవసరం తీరాక బండకేసి కొడతాడు. కనీసం వాడి ముఖం కూడా చడడు. ఆయనంతే. ఇప్పుడు మీడియా గురించి చర్చ. ఉద్యమ సమయంలో మీడియా సపోర్టు కేసీఆర్‌కు అంతా ఇంతా కాదు. అందరితో పాటు మీడియా అతన్ని మోసింది. కేసీఆర్‌ కూడా అమాయకమీడియాను అలా వాడేసుకున్నాడు. అధికారం వచ్చిన తరువాత ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్నాక.. అసలు దగ్గరికి రానిస్తే కదా మీడియాను. ఎప్పుడైనా సరదాగా మాట్లాడింది లేదు. దగ్గరికి రానిచ్చింది లేదు.

ప్రెస్‌మీట్‌లో తమ పేరు పలికితే చాలు..తమ వైపు ఓ చూపు చూస్తే చాలు.. పలకరిపుగా చూస్తే చాలు అనే దుర్బర మానసిక పరిస్థితికి వచ్చేలా చేశాడు కేసీఆర్‌. ఏమయ్యా రాహుల్‌..! సారీ టుసే..!! నాదే పేపర్‌.. రాయి నేను చెప్తున్నాగా రాజ్యాంగం ఎందుకు మార్చాలో..! ఏ ఊకోవయా నీకేం తెల్వదు..! మరేం చేద్దామంటావు ఓ లక్ష ఇద్దామంటావా..!! అని వెటకారపు ఆన్సర్లలో హడలెత్తించి అసలు కేసీఆర్‌కు ప్రశ్న వేయాలంటే ఎక్కడ ఇజ్జత్‌ తీస్తాడో అని జడుసుకుని చచ్చే పరిస్థితి తెచ్చి.. మీడియాను అంటరాని వారిని చేసిపాడేశాడు కేసీఆర్‌.

ఇప్పుడు మీడియా అవసరం వచ్చింది. టీవీ9లో లైవ్‌ షో ఉందని బీఆరెస్‌ శ్రేణులు సోషల్‌ మీడియాలో ఓ తెగ ఊదరగొడుతున్నారు. టీఆర్‌పీ రేటింగ్‌ ఆమాంతం పెరగనుందని కూడా ఆ చానెల్‌కు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేస్తున్నారు. పాపం అంతకు మించి ఏం చేస్తారు అల్ప సంతోషులు. కేటీఆర్‌కూ తత్వం బోధపడ్డది. మేము ఓ వంద యూ ట్యూబ్‌ చానెళ్లు పెట్టుకుని ఉంటే బాగుండు అని పైత్యం మాటలు మాట్లాడినా.. తమను అబద్దపు ప్రచారాలతో ఓడించారని ఎంత తమ అహంకారాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసినా మీడియాతో పెట్టుకుంటే మట్టికొట్టుకుపోతామని తండ్రి కొడుకులకు అవగతమైంది.

కానీ అప్పటికే ఆలస్యమయ్యింది. చాలా నష్టమే జరిగింది. పూడ్చుకోవాలంటే సమయమూ పడుతుంది.. తండ్రి కొడుకులు ఇంకా మారాలంటే కూడా చాలా చాలా సమయమే పడుతుంది. అసలే మారే చాన్స్‌ లేదంటే పాతాళంలోకి వెళ్లి వెతుక్కోవాల్సి వస్తుంది ఆ పార్టీ భవిష్యత్తు..!

You missed