(దండుగుల శ్రీనివాస్)
అర్వింద్ దూకుడు కాంగ్రెస్ కొత్త అస్త్రం ప్రయోగిస్తున్నది. ఉత్తరాదిన ముగిసిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇండియా కూటమికే అనుకూలంగా ఉన్నాయని, ఎన్డీయే ఇక ఇంటికే అని ప్రచారం చేయడంతో పాటు.. రాష్ట్రంలో పోటీ చేస్తున్న అందరిలోకెల్లా నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి జీవన్‌రెడ్డి సీనియర్ అని… ఇండియా కూటమే అధికారంలోకి రానున్న నేపథ్యంలో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఖాయమంటూ ప్రచారం మొదలుపెట్టింది.
ఇటీవల సీఎం రేవంత్ కూడా నిజామాబాద్ బహిరంగ సభలో ఇదే విషయాన్ని చెప్పినా.. ఇప్పుడు దీన్ని మరింతగా దూకుడుగా ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. వాస్తవానికి అర్వింద్ ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి పక్కా అని తొలత ప్రచారం చేశారు. కానీ ఇదే అస్త్రాన్ని తనకు పోటీగా ఉన్న అభ్యర్థి అర్వింద్‌పై కాంగ్రెస్ ప్రయోగిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు ముగిసిన ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాబోతున్నాయని జోస్యం చెబుతోంది.
అందుకే ఇక్కడ జీవన్‌రెడ్డిని గెలిపిస్తే కేంద్రంలో మంత్రి పదవి ఇతనికే వస్తుందని, తెలంగాణలో మిగితా వారికి అంత సీన్ లేదని ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే ప్రెస్‌మీట్‌లో పేర్కొనడం గమనార్హం.