బహుళా ఇలాంటి పరిస్థితి ఏ నియోజకవర్గంలో లేదు కాబోలు. లేకుంటే సీఎం పోటీ చేస్తున్నాడు కాబట్టి అప్పటి వరకు ఉన్న లుకలుకలన్నీ ఇలా బయటకు వస్తున్నాయో తెలియదు. కానీ కామారెడ్డి తోక ఇంకా వంకరగానే ఉంది. కేటీఆర్ ఎంత చమటోడ్చినా… సామదానబేధ దండోపాయాలన్నీ ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే అంతలా పాతుకుపోయారు. మూలాలు పెకిలించాలంటే కొంచెం కష్టమే మరి. కొంచెం కాదు.. రామన్నకే తలనొప్పిని తెచ్చిపెట్టేంత. అసలేం జరిగింది. కామారెడ్డిలో ఏం జరుగుతోంది. ఇక వర్గ విభేదాలు, గ్రూపులు పాతుకుపోయాయి. లోకల్ లీడర్ ఉదాసీన వైఖరి అనుచరుల విచ్చలవిడితనానికి కారణమైంది.
తెలిసినా తెలియకుండా ఉండటం ఒక తప్పైతే.. ఆ తప్పును మందలించకుండా.. ఎగదోయడం.. తమాషా చూడటం మరీ నేరం. ఆ నేరానికి ప్రతిఫలం పార్టీకి గడ్డు పరిస్థితులు. ఇవే ఇప్పుడు కేసీఆర్ పోటీకి, మెజారిటీకి పెద్ద దెబ్బ. అది గ్రహించాడు కేటీఆర్. అందుకే రంగంలోకి దిగాడు. బహిరంగంగా మందలించాడు. పిలిచి తిట్లదండకం అందుకున్నాడు. వార్నింగ్ ఇచ్చి సరి చేద్దామనీ చూశాడు. మీ సంగతులన్నీ నాకు తెలుసురోయ్..! అని జాతకాలు బయటపెట్టాడు. కానీ పరిస్థితి మారలేదు. గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి అనే నేత తాజాగా ఉద్యమకారుడు, ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా చేసిన తిరుమల్‌రెడ్డితో తగాదా పడ్డాడు. వార్నింగ్ ఇచ్చాడు. తనకు పార్టీలో ఏ బాధ్యతలు ఇవ్వడం లేదంటూ గొడవకు, దుర్భాషలకు దిగాడు. ఇదే ఇప్పడు కామారెడ్డి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తిరుమల్‌రెడ్డి పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు కేటీఆర్ చేరవేయడమే అతను చేసిన నేరమైంది.
దీంతో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఇప్పటి వరకు పంచాయతీలు, సెటిల్‌మెంట్లు, దందాలు చేసిన ఈ నేత ఇప్పుడు యాక్టివ్ కావాలనుకున్నాడు. కానీ అతను తిరిగితే పడే ఓట్లు కూడా పడవనే మెసేజ్ పార్టీకి వెళ్లింది. ఇదే ఇప్పుడు లొల్లికి దారి తీసింది. రెండ్రోజుల కేటీఆర్ కామారడ్డి టూర్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడిది కేటీఆర్‌కు మరింత తలనొప్పి తెచ్చిపెట్టింది. లోకల్ ఎమ్మెల్యే, పార్టీ అధ్యక్షుడికి ఈ విషయాన్నీ తెలుసు. కానీ ఏమీ పట్టించుకోకుండా ఉండటంతోనే ఇదంతా జరుగుతుందనే ప్రచారం ఊపందుకున్నది. ఓ వైపు కేటీఆర్ కాలికి బలపం కట్టుకుని కేసీఆర్ బంపర్ మోజారిటీ కోసం కంకణం కట్టుకుని మరీ తిరుగుతుంటే.. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇలా పెత్తనం కోసం, తమ పరపతి ఉనికి కోసం గ్రూపులను పెంచి పోషిస్తూ తన్నుకుంటున్నారు.