నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ షరా మామూలుగా ఇవాళ మళ్లీ తన నోటి దూలను ప్రదర్శించాడు. అదీ మహిళా నేతల మీద. ఒకరు ఎమ్మెల్సీ కవిత కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. అర్బన్‌లో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో అర్వింద్‌ కవితనుద్దేశించి మరీ చీప్‌ కామెంట్స్‌ చేయడం కలకలం రేపింది. కవిత చనిపోతే ఇరవై లక్షలిస్తానంటూ.. ఏవేవో మాట్లాడాడు ఎంపీ. ఈ మాటలు అసందర్భం. జుగుప్సాకరం.

హుందా రాజకీయాలకు పాతర పెట్టినట్టేనని చెప్పొచ్చు. ఈ మాటలు ఎవరూ హర్షించరు. గతంలో ఓసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు అర్వింద్‌. కానీ ఈసారి ఎమ్మెల్సీ కవిత .. అర్వింద్‌ మాటలపై విరుచుకుపడ్డారు. ఆమె జగిత్యాలలో బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ఓ వీడియో విడుదల చేశారు. ఘాటుగా కామెంట్‌ చేశారు ఆమె. నీ అక్కనో,చెల్లెనో, అమ్మనో ఇలా అంటే నీకు ఎలా ఉంటుంది..? అంటూ ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి చిల్లర మాటల రాజకీయాలు తెలంగాణలో ఇప్పటి వరకు లేవని, గతంలో ఆంధ్ర పాలకులపైనా ఉద్యమ సమయంలో ఇలాంటి నీచమైన మాటలు ఎవరూ మాట్లాడలేదని ఆమె ఆవేదనతో అన్నారు. తెలంగాణ ప్రజలు అర్వింద్‌ లాంటి సంస్కృతి, మహిళల పట్ల మర్యాద, గౌరవం లేకుండా మాట్లాడే విధానాన్ని తిప్పికొట్టాలని, తగిన బుద్ది చెప్పాలని ఆమె పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మాటలు తూటలు పేలుతున్నాయి. ఇలా అర్వింద్‌ లాంటి నేతల నోట మాటలు మిస్‌ఫైర్‌ కూడా అవుతున్నాయి. ఇవి ఎటు దారి తీస్తాయో.. రాజకీయాల్లో ఎలాంటి పెనుమార్పులకు కారణమవతాయో చూడాలి.

ఇక ఆకుల లలితపై అర్వింద్‌ అనుచిత వ్యాఖలు చేశారు. ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరి అర్బన్‌ టికెట్‌ తెచ్చుకుంటున్నారని తెలిసి.. తన అక్కసును వెళ్లగక్కారు. అసందర్భ ప్రేలాపన చేశాడు. దీనిపై ఆకుల లలిత ఘాటుగానే స్పందించింది. ఫైర్‌ అయ్యింది. ఇలా స్పందించింది.

‘అర్బన్‌ నుంచి కాంగ్రెస్‌ నాకు అధిష్టానం టికెట్‌ ఇస్తామని అనుకుంటున్నది. ఈ సమయంలోనే అర్వింద్‌ తనలో ఇమిడి ఉన్న అన్న ప్రేమను బయటకు కక్కాడు. ఆనాడు ఎమ్మెల్సీ ని తీసుకుని తండ్రి డీఎస్‌ను మోసం చేశానని, ఇప్పుడు అర్బన్‌ టికెట్‌ తీసుకుంటూ అన్నను మోసం చేస్తన్నానే రీతిలో కుటుంబ పాలిటిక్స్‌ మాట్లాడి మరీ చీప్‌ అయ్యావు. అవునూ…! నేను ఎటు పోతే నీకెందుకు..? ఓహో నీ పార్టీ అభ్యర్థి ధన్‌పాల్‌ ఓడిపోతాడనా.. భయం. మున్నూరుకాపులంతా నాకే ఓటేస్తే బీజేపీకి పుట్టగతులుండనవా నీ వణుకు. అందుకే ఓ మహిళా నేత అని కూడా చూడకుండా నీ కుత్సుత బుద్ది చూపుతున్నావా..? మీ నాన్న గురించి గొప్పగా మాట్లాడుతున్నావే..! ఇంట్లో బంధించి ఎవరినీ కలవనీయకుండా జీవిత చరమాంకంలో ఆయనకు నరకం చూపుతున్నదెవరు..? చివరకు ఇప్పుడు ప్రేమ చూపుతున్న నీ అన్న సంజయ్‌ను కూడా మీ నాన్నను కలవనీయకుండా అడ్డుకుని పైశాచికత్వం పొందుతున్నదెవరు..? నేను కష్టపడి అంచెలంచెలుగా ప్రజాప్రతినిధిగా ఎదిగాను. ఓ మహిళ ఎంతటి శ్రమకోరిస్తే.. ప్రజాశీస్సులు పొందుతుందో నీకేం తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అర్బన్‌ టికెట్‌ ఇచ్చేందుకు సిద్దపడి ఉందంటే.. నా ప్రజాబలం, నేను ఉన్న స్థాయి.. నాకున్న ప్రజాశీస్సులు ఉన్నవి గనుకనే కదా. మరి ఇవన్నీ తెలియని నీవు.. తప్పుడు హామీలతో ఎంపీగా గెలిచి పబ్బం గడుపుకుంటున్న నీవు ఓ మహిళా నేతను, అందునా మున్నూరుకాపుల మహిళలకు, ఆ సమాజానికి రాష్ట్ర స్థాయిలో సేవకురాలిగా, నాయకురాలిగా, రక్షకురాలిగా బాధ్యతాయుత పదవిలో ఉన్న నాపై నోటికొచ్చినట్ట మాట్లాడటం నీలోని అహంకారానికి, మహిళల పట్ల చిన్నచూపుకు, కాపు జాతి పట్ల నీకున్న కుత్సుత బుద్దికి నిదర్శనం. వెంటనే నీవు యావత్ మహిళాలోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదంటే నీకు ఎన్నిక ఏదైనా తగిన బుద్ది చెప్పి చరిత్రహీనుడిగా మార్చే రోజులు దగ్గరలోని ఉన్నాయి.. ఖబడ్దార్..!’

 

You missed