కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పార్టీ అధిష్టానం పై కినుక వహించాడు. ఆయన గత కొద్ది రోజులుగా అలక పాన్పెక్కాడు. పార్టీ కార్యక్రమాలకు, నాయకులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. చాలా వరకు ఫోన్లు రిసీవ్ చేసుకోవడం లేదు. కారణం అధిష్టానం వైఖరి. జిల్లా అధ్యక్షుడి తన సరైన గుర్తింపు నివ్వకపోవడం, టికెట్ల కేటాయింపుల్లో తనను అప్రోచ్ కాకపోవడం, కనీసం మాట వరుసకైనా తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం తదితర కారణాలు ఆయన్ను వేదనకు గురి చేసినట్టు తెలుస్తోంది.
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే కమిటెడ్ నేత అతను. కాంగ్రెస్ పార్టీ కోసం గత ఐదేళ్లుగా ఆయన కాలికి బలపం కట్టుకుని కార్యకర్తలను, క్యాడర్‌ను కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వస్తున్నాడు. జిల్లాలో పార్టీ చాలా చోట్ల కనుమరుగై పోయిన దుర్దినాలను చూసి చలించిన నేత.. ఆ తర్వాత పార్టీ బూస్టింగ్ కోసం తపన పడిన వైనం .. ఇనవ్నీ ఇప్పుడు అధిష్టానం కనీసం లెక్కలోకి తీసుకోలేదని మనోవేదన ఆయన్ను వెంటాడుతోంది. బాల్కొండ నుంచి ఆయన పార్టీ టికెట్ ఆశించాడు.
ప్రచారం కూడా విస్తృతం చేశాడు. కానీ సునల్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు మానాల మోహన్‌రెడ్డి. అప్పట్నుంచి ఆయన పార్టీ అధిష్టానం పై కినుక వహించాడు. రాహుల్ జిల్లా పర్యటన ఉన్న క్రమంలో ఆయన బయటకు వస్తాడా..? లేదా అజ్ఞాతంలో ఉంటాడా..? అనే అంశం పార్టీ శ్రేణుల్లో ఆసక్తిగా మారింది.