ప్రధాని మోడీ ఇందూరు వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించాడు. పక్కాగా ఆయన పర్యటన, స్పీచ్‌ ఎన్నికల ప్రచారాన్ని తలపించాయి. ఆయన ప్రసంగం వాడి పెరిగింది. ఘాటు, సంచలన వ్యాఖ్యలకు ఇందూరు సభ వేదికగా మారింది. మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన తొలిసారి తన పంథాను వీడి కేసీఆర్‌ను డైరెక్ట్ అటాక్ చేశారు. తమ మధ్య జరిగిన రహస్య చర్చలను కూడా ఈ వేదికగా బయటపెట్టడం కలకలం రేపింది. కేటీఆర్‌ను సీఎంను చేస్తానన్న కేసీఆర్ అభ్యర్థనను తను తిరస్కరించానని మోడీ తేటతెల్లం చేశాడు.

ఎన్డీయేలో చేరుతా.. జీహెచ్ఎంసీ మేయర్‌ ఎన్నికలో తనకు బీజేపీ మద్దతు కావాలని కోరిన పిమ్మట తను ససేమిరా అన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్నుంచి తన కళ్లలోకి చూసేందుకే కేసీఆర్ భయపడుతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చకు తెర తీసింది. కనీసం ఓ ఐదేండ్ల పాటు బీజేపీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తూనే.. కేసీఆర్, కుటుంబం అక్రమంగా సంపాదించిన సొమ్మంతా ప్రజల ముందుంచుతానని వాగ్దానం చేయడం కలకలం రేపింది. కాంగ్రెస్‌, బీఆరెస్‌ చీకటి ఒప్పందం చేసుకుంటుందని అన్న మోడీ.. హిందూ,ముస్లింల ఇష్యూలను కూడా తన ప్రసంగంలో భాగం చేశారు. మత తత్వాన్ని తన ప్రసంగంలో ప్రధానంగా తీసుకొచ్చారు. ఇది ఫక్కాగా ఎన్నికల ప్రచార సభలాగే సాగింది. మరే హామీ, ప్రజలకు వరాలు మోడీ ప్రకటించలేదు.

కేవలం ఐదేండ్ల పాటు తమకు అవకాశం ఇచ్చి చూడండనే విజ్ఞప్తికే సరిపోయాడాయన. కేంద్ర నిధులను కేసీఆర్‌ దోచుకు తింటున్నాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఎంతో మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణను కుటుంబం పాలిస్తూ దోచుకు తింటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డు అంశాన్ని నిమిత్తమాత్రంగానే ఆయన ప్రస్తావించాడు. కేసీఆర్ టార్గెటేడ్‌గా ఈ సభ జరిగింది. అదీ ఇందూరు వేదిగా రహస్య మంతనాల చిట్టాను బయటపెట్టి మరీ కేసీఆర్‌ మరోరూపాన్ని జనాల ముందుంచాలనే తాపత్రయాన్ని ప్రదర్శించారు మోడీ. ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీజేపీ గ్రాఫ్‌ పడిపోతున్న క్రమంలో మోడీ తన ప్రసంగాలతో దూకుడు పెంచాడనడానికి ఇందూరు సభ ఓ నిదర్శనంగా నిలిచింది.

You missed