నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా వద్ద ధనముంది.. అందరికీ మంచి చేయాలనే గుణం కూడా ఉందని ఎమ్మెల్సీ కవిత ప్రశంసించారు. అర్బన్‌లో పాదయాత్ర నిర్వహించిన అనంతరం ఆమె పాత కలెక్టరేట్ మైదానంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంచేందుకు ఎమ్మెల్యే తనే స్వయంగా వారింటికి వెళ్లి మిఠాయిలతో నోరు తీపి చేస్తారని, చీర, సారెలతో వాళ్లను గౌరవించి కేసీఆర్ పంపిన చెక్కులను అందజేస్తారని ఆమె గుర్తు చేశారు.
మర్యాద తెలిసిన నేత బిగాల అని, అభివృద్ది చేస్తేనే కాదు.. ఆత్మగౌరవానికి కూడా బిగాల పెద్ద పీట వేస్తారని అలాంటి నేతను కడుపులో పెట్టుకుని చూసుకోవాని ఆమె కోరారు. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేనైనా ఇలా చేశారా అని ఆమె ప్రశ్నించారు. ధనముండగానే సరిపోదు.. అందరికీ మంచి చేయాలనే గుణం కూడా ఉండాలన్నారు. అది బిగాల గణేశ్ గుప్తా దగ్గర ఉందని, మర్యాద తెలిసిన నాయకుడికి మద్దతుగా నిలబడాలని ఆమె ఆకాంక్షించారు.