చాలాకాలం తర్వాత కవిత అర్బన్‌లో మళ్లీ తనదైన ముద్ర వేసుకున్నారు. భారీ ర్యాలీ, పాదయాత్రతో హల్‌చల్ చేశారు. వాస్తవానికి ఈ పాదయాత్ర ఎప్పుడో నిర్వహించాల్సింది. కానీ వాయిదా పడింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తరువాత ఆమె తొలిసారిగా జిల్లాకు రావడం.. అదే రోజు పాదయాత్రకు కూడా ప్లాన్ చేయడంతో ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇప్పటికే బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో కవిత పర్యటనలు, పాదయాత్రలు ముగిశాయి. కీలకమైన అర్బన్‌లో ఆమె చేపట్టిన భారీ పాదయాత్ర అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేశారామె. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి ఆమె ఐటీఐ నుంచి పాత కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. ఎర్రటి ఎండలో బీఆరెస్ శ్రేణులతో కలిపి కదం కలిపారు. దాదాపు మూడు గంటల పాటు ఈ పాదయాత్ర కొనసాగింది.
ఈ సందర్భంగా ఆమె ప్రసంగం మహిళ రిజర్వేసన్ బిల్లు, తెలంగాణ ప్రభుత్వం మహిళలకు చేస్తున్న అభ్యున్నతిపై కొనసాగింది. బీసీ సబ్ కోటా కోసం కాంగ్రెస్ ఇప్పుడు మాట్లాడుతున్నదని, తాము అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదంటూ మండిపడ్డారు. కేసీఆర్ లాగ మహిళలు పథకాలు అందజేస్తున్న ప్రభుత్వం దేశంలోనే ఏదీ లేదన్నారామె. వృద్దురాళ్లకు పెద్దకొడుకులా, ఒంటరి మహిళలకు అన్నగా, బీడీ అక్కలకు మేనమామల ఆసరా పింఛన్లు అందిస్తున్నారన్నారు. మార్కెట్ కమిటీల్లో, రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవిలలో మహిళలకే స్థానం ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఏమీ చేయని కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నదని ఎద్దేవా చేశారామె.
ఇందూరు వేదికగా రాహుల్‌కు ఆహ్వానం పంపారామె. ఇక్కడ తిరిగి వచ్చేది బీఆరెస్ ప్రభుత్వమేనని రాహుల్‌ను ఇక్కడి పిలుస్తామని అన్నారు. సబ్బండవర్ణాల అభివృద్దే ధ్యేయంగా బీఆరెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఈ పార్టీని కడుపులో పెట్టుకుని చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోని రావడం సోనియా తన కలగా చెప్పుకున్నారని, ఇదేం కల..? కల అంటే ఎలా ఉండాలె… అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడేలా, కేసీఆర్ ఆలోచనలా, అమలు చేస్తున్న వైనంలా…. అంటూ ఆమె సోనియాకు కౌంటర్ ఇచ్చారు. అర్బన్‌లో పాదయాత్ర సక్సెస్‌తో బీఆరెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం వెల్లివిరిసింది. కవిత రీ ఎంట్రీతో అర్బన్, జిల్లా రాజకీయాలన్నీ ఇటే చూస్తున్నాయి.