ఆ గట్టునుంటావా..? ఈ గట్టుకొస్తావా..?

బండి సంజయ్‌ పంచన చేరిన అర్వింద్‌ అసమ్మతి నేతలు..

బీజేపీ నీ ఇంటి పార్టీయా..? సీనియర్లను పక్కన బెడ్తే ఊకుంటమా..??

అర్వింద్‌పై అసమ్మతి తిరుగుబాటు బావుటా…

బండి సంజయ్‌ వర్గంలోకి చేరిన వినయ్‌, సునీల్‌, బస్వా, మేడపాటి…..

జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో బండితో టికెట్‌ తెప్పించుకుని అర్వింద్‌ పెత్తనానికి చెక్‌ పెట్టే యోచన…

గ్రూపులుగా విడిపోయిన జిల్లా బీజేపీ… అయోమయంలో కార్యకర్తలు, శ్రేణులు….

 

అర్వింద్‌ వచ్చిన తర్వాత బీజేపీ స్వరూపం మారిపోయింది. సీఎం కూతురు కవితనే ఓడగొట్టాననే అహంకారం తలకెక్కింది. దీంతో తను లేకపోతే పార్టీకి అంత సీనే లేదు… అసలు పార్టీ ఉనికే లేదు అనే రేంజ్‌లో చెలరేగిపోయాడు. అంతా ఇష్టారాజ్యంగా నడిపించేశాడు. అప్పటి వరకు ఉన్న సీనియర్లనంతా ఓ మూలకు విసిరేశాడు. ప్రెస్‌మీట్లు కాదు కదా.. పార్టీ ఆఫీసులోకి కూడా వారి ఎంట్రీ లేకుండా చేశాడు. తనతో మంచిగుంటే సరి.. లేకపోతే వారికి రాజకీయ ఉరే..అనే రీతిలో వ్యవహరించాడు. అసమ్మతివాదులు, అసంతృప్త నేతలు ఓపికపట్టారు. సహనం వహించారు. ఓపిక నశించింది. విరక్తి పుట్టింది. ఆగ్రహం రెట్టించింది. ఇదే సమయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు అర్వింద్‌కు మధ్య అంతరం పెరిగింది. ఎంతలా అంటే.. ఉప్పు నిప్పులా.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా.

దీంతో ఇదే మంచి సమయం అనుకున్నారు అసంతృప్త నేతలంతా. పోలోమని పోయి బండి సంజయ్‌ పంచన చేరారు. తమకు టికెట్ ఇవ్వకుండా ఇతరులను, కొత్త వారిని, పార్టీకి సంబంధం లేని వారిని ప్రోత్సహిస్తూ.. మీకే టికెట్‌ అంటూ హామీలు కూడా ఇచ్చేస్తున్న వైఖరిని వీరు జీర్ణించుకోలేకపోయారు. అర్వింద్‌ ఒంటెత్తు, అహంకారపూరిత పోకడలకు చెక్‌ పెట్టాలని బండి సంజయ్‌తో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూ… ఇక్కడి పార్టీ పరిస్ఙితులను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేలా చేస్తున్నారు. బాల్కొండ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ సునీల్‌రెడ్డి, ఆర్మూర్‌లో వినయ్‌రెడ్డి, అర్బన్‌ నుంచి జిల్లా అధ్యక్షుడు బండి సంజయ్‌, బోధన్‌ నుంచి మేడపాటి ప్రకాశ్‌ … ఇలా అంతా బండి సంజయ్‌ పంచన చేరారు. వీరే కాదు అర్బన్‌లో సీనియర్లంతా ఇప్పుడు బండి వెంబడే. పార్టీని వీడేది లేదు. పార్టీలో ఉంటేనే అసమ్మతి పోరు సాగిస్తామని, అర్వింద్‌ను ఎదుర్కుంటామని వీరంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా సవాల్‌ విసరుతున్నారు. వీరిని తెర వెనుక ఉండి బండి సంజయ్‌ ప్రోత్సహిస్తూ వస్తున్నాడు.

వేరే పార్టీలోకి వెళ్తే అర్వింద్‌కు మరింత అవకాశం ఇచ్చినట్టవుతుందని టికెట్‌ ఆశించిన వారంతా బండి సంజయ్‌పై గంపెడాశలు పెట్టుకుని పోరుబాట పట్టారు. ఒకవేళ చివరి నిమిషయంలో తమ ప్రయత్నం బెడిసి కొడితే కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. కానీ, ఈ గ్రూపుల లొల్లి పార్టీలోని కార్యకర్తలకు, నాయకులకు గందరగోళ పరిస్థితులను తెచ్చిపెట్టాయి. అసలే కర్ణాటక ఫలితాలతో ఊపు మీదున్నామనుకున్న తమకు కాంగ్రెస్‌ ఆనకొండలా కనిపిస్తుండగా… ఈ గ్రూపుల లొల్లితో ఎలా నెట్టుకొచ్చేది.. ఎలా గెలుచుకొచ్చేది అని సామాన్య కార్యకర్తలు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. సీనియర్లంతా అర్వింద్‌కు తగిన శాస్తే జరుగుతుంది.. ఇలా తిరగబడాల్సిందే. పార్టీని కాపాడుకుని, సీనియర్లకు గుర్తింపు వచ్చే వరకు పోరాడాల్సిందే అంటున్నారు.

 

You missed