విలీన పంచాయతీలకు మహర్దశ.. బాజిరెడ్డి చొరవతో రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులు..

నగర శివారులోని పంచాయతీల్లో శరవేగంగా అభివృద్ధి.. ఇప్పటికే రూ.36 కోట్లతో అభివృద్ది పనులు పురోగతిలో..

మరో రూ. 15 కోట్లు కావాలని కోరిన బాజిరెడ్డి గోవర్దన్‌…. నిధుల విడుదలకు మంత్రి కేటీఆర్‌ ఆమోద ముద్ర…

త్వరలో టెండర్లు.. పనులు షురూ… సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన బాజిరెడ్డి….

మరిన్ని నిధులతో విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా… బాజిరెడ్డి గోవర్దన్‌…

నగరీకరణలో భాగంగా నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనమైన నగర శివారు గ్రామ పంచాయతీలకు మహర్ధశ పట్టింది. నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కార్పొరేషన్‌లో విలీనమైన ఐదున్నర గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఇతోధికంగా నిధుల సాయం చేసింది. ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ నిధుల మంజూరు కోసం కృషి చేసి విలీన గ్రామాల అభివృద్ధికి బాటలు వేశారు. మొత్తం రూ. 50 కోట్లతో ఈ ఐదున్నర విలీన గ్రామాల అభివృద్ది జరగనుంది. ఇప్పటికే నగర సుందరీకరణలో భాగంగా శివారు విలీన గ్రామ పంచాయతీలలో రూ. 36.66 కోట్లతో సీసీ రోడ్లు,బీటీ రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్‌ లైటింగ్, డివైడర్లు, బ్రిడ్జి పనులు కొనసాగుతుండగా.. బాజిరెడ్డి తాజాగా మరో రూ. 15 కోట్ల నిధులను విలీన పంచాయతీల అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్‌ను కోరిన మీదట.. ఆయన వెంటనే ఈ నిధులు మంజూరు చేస్తూ ఆమోద ముద్ర వేశారు. విలీన పంచాయతీల డెవలప్‌మెంట్‌ పనుల గురించి, నిధుల కేటాయింపుల విషయాలను బాజిరెడ్డి నగర శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు.

విలీన పంచాయతీలైన ముబారక్‌నగర్‌, గూపన్‌పల్లి, కాలూర్‌, ఖానాపూర్‌, సారంగపూర్‌, బోర్గాం (పి), మాధవనగర్‌లలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలో మరిన్ని నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరుతానని, మరింత అభివృద్ది కోసం పాటుపడతానని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు బాజిరెడ్డి గోవర్దన్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఒలంపిక్‌ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బాజిరెడ్డి జగన్‌, ముబారక్‌నగర్‌ కార్పొరేటర్ యమునా అనిల్‌, నుడా డైరెక్టర్‌ ఉసికె సంతోష్‌, గూపన్‌పల్లి కార్పొరేటర్‌ శ్రీనివాస్ రెడ్డి, ఖానాపూర్‌ కార్పొరేటర్‌ లలిత గంగాధర్‌, సారంగపూర్‌ కార్పొరేటర్‌ అక్బర్‌ తదితర శివారు పంచాయతీల బీఆరెస్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విలీన గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్న బాజిరెడ్డి గోవర్దన్‌కు వీరంతా ధన్యవాదాలు తెలిపారు.

You missed