సంధించే వేళాయెరా..!
కేసీఆర్ అమ్ముల పొదిలో అస్త్రాలు..
ప్రతిపక్షాల ఎత్తుగడలు ఇక తుత్తునియలే…
ఇవాళ పార్టీ నేతలకు భవిష్యత్ దిశానిర్ధేశం.. దశాబ్ది వేడుకలతో ఉద్యమ స్పూర్తిని మళ్లీ రగిలించే యత్నం…
రేపు కొత్త సచివాలయంలో తొలి కేబినేట్ భేటీ…. కీలక నిర్ణయాలు…
వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్:
ఎన్నికల వేడి రాజుకున్నది. రోజులు సమీపిస్తున్నాయి. కర్ణాటక ఫలితాలు రానే వచ్చాయి. బీజేపీకి భవిష్యత్తు కానవచ్చింది. ఇక బీఆరెస్ ప్రతాపం దేశంలో చూపాల్సిన తరుణం ఆసన్నమైంది. మరి రాష్ట్రంలో కూడా పార్టీ ఉనికి కాపాడుకుని మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలె కదా..! అందుకే కేసీఆర్ ఇప్పటి దాకా తన అమ్ముల పొదిలో దాచి ఉంచిన అస్త్రాలను బయటకు తీస్తున్నారు. ఒకనాడు అసెంబ్లీ సాక్షిగా ఇవే మాటలన్నాడు. తన వద్ద ఉన్న పథకాల అస్త్రాలు సంధిస్తే ప్రతిపక్షాలు కనుచూపుకు కూడా కానరాకుండా పోతాయని. ఇప్పుడు అదే సమయం ఆసన్నమైంది.
మొన్నటి దాకా పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన కేసీఆర్… ఇప్పుడు తెలంగాణ ఏర్పడి పదేళ్లలోకి అడుగిడుతున్న సందర్భంలో దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఘనంగా వేడుకల రూపంలో పండుగ వాతావరణంలో నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపైనే ఇవాళ తెలంగాణ భవన్‌లో జరిగే పార్టీ నేతల సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. 18న కొత్త సచివాలయంలో తొలి కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోనున్నది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇళ్ల నిర్మాణాలకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం, దళిత బంధు పంపిణీ, బీసీ, గిరిజన బంధుపై క్లారిటీ.. తదితర కీలక విషయాలపై కేసీఆర్ కేబినేట్‌లో తన నిర్ణయాలను ప్రకటించనున్నారు.
దీంతో పాటు త్వరలో ఖాళీ కాబోతున్న రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసి కేబినెట్ ఆమోదంతో గవర్నర్‌కు పంపనున్నారు. ఎన్నికల ఏడాది కావడం… కర్ణాటక ఫలితాలతో బీజేపీ డీలా పడి .. కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉండటంతో నిరంతరం ప్రజల్లో ఉండి వచ్చే ఎన్నికలను ఎలా ఫేస్ చేయాలో ఈ రెండు సమావేశాల్లో కీలక దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. సిట్టింగు అభ్యర్థిలకిది అగ్నిపరీక్షే. ప్రజాక్షేత్రంలో ఉంటారా..? అందరికీ దగ్గరవుతారా..? పోటీకి దూరమవుతారా..? అని తేల్చుకోవాల్సిన తరుణమని కేసీఆర్ ఈ సమావేశాల ద్వారా ఎమ్మెల్యేలకు పరోక్ష సంకేతాలు, ప్రత్యక్ష వార్నింగులు ఇవ్వనున్నారు. దీంతో అందరి దృష్టి కేసీఆర్ పైనే ఉంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని. కీలమైన ప్రకటనలు ఏమి చేస్తారోనని.