మాస్ లీడర్‌గా తనకంటూ ఓ ముద్రవేసుకుని, ఓటమెరుగని నేతగా పేరుగడించి ఆర్టీసీ చైర్మన్‌గా రాణిస్తున్న బాజిరెడ్డి గోవర్దన్… ఇందూరు జిల్లాలో తన కుల బలగానికి పెద్ద దిక్కుగా నిలిచాడు. తన సామాజికవర్గమైన మున్నూరుకాపు కుల బలగం ఆయన తనయుడు బాజిరెడ్డి జగన్‌ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నది. ఇవాళ జరిగిన మున్నూరుకాపు సంఘ జిల్లా ఎన్నికలకు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవన్న హాజరయ్యాడు. ముఖ్య అతిథిగా బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు.
కొండ దేవన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో నగర శివాజీనగర్ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు గాండ్ల లింగం జగన్‌ను జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదించగా అంతా ముక్తకంఠంతో ఏకగ్రీవంగా చేతులెత్తి ఎన్నుకున్నారు. వాస్తవంగా గత కొంతకాలంగా జగన్ జిల్లా మున్నూరుకాపు సంఘానికి కన్వీనర్‌గా ఉంటూ వస్తున్నాడు. అధికారికంగా ఎన్నికలు ఇవాళ జరిగాయి. బాజిరెడ్డి గోవర్ధన్ అనుమతితో అధ్యక్ష ఎన్నికకు రెడీ అయ్యాడు జగన్. అంతా అనుకున్నట్టుగానే జగన్‌ను జిల్లా కుల సభ్యులు, పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మున్నూరుకాపు సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. ప్రతీ ఎన్నికలో వీరి ఓట్లు ఓటమి, గెలుపుల్లో కీలక పాత్ర పోషిస్తాయనడంలో అతిశయోక్తి కాదు. మొన్నమొన్నటి వరకు డీఎస్ పట్టణంలో మున్నూరుకాపు కులానికి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు.
ఎప్పుడైతే ఆయన రాజకీయంగా ప్రజలకు దూరమవుతూ వచ్చారో… అర్వింద్ బీజేపీ నుంచి ఎంపీగా గెలిచాడో అప్పటి నుంచి కాపులంతా మరో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తు వచ్చారు. వాస్తవానికి బాజిరెడ్డి గోవర్దన్‌ను కులాలకు అతీతంగా అంతా ఇష్టపడతారు. మున్నూరుకాపు కులస్తులు కూడా బాజిరెడ్డి వైపు ఉన్నా… డీఎస్ కుటుంబం కారణంగా బాజిరెడ్డి పంచన చేరేందుకు, కలసేందుకు కూడా జంకేవారు. డీఎస్ కేవలం పట్టణ కుల సంఘాలకే పరిమితం కావడం… జిల్లా కమిటీలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ కులస్తులకు ఎవరూ పెద్ద దిక్కుగా లేకుండా పోయారు. చాలా సార్లు జిల్లా అధ్యక్షులుగా చేయమని బాజిరెడ్డి వద్దకు ప్రతిపాదనలు వచ్చినా.. ఆయన సుతిమెత్తగా తిరస్కరించారు.
డీఎస్ పూర్తిగా వీల్ చైర్‌కు అంకితమవ్వడం, ఎంపీగా అర్వింద్ ఒంటెత్తు పోకడలు, సంజయ్ తిరిగి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఏర్పడిన రభస కారణంగా ఆ కుల సభ్యలు, పెద్దలంతా బాజిరెడ్డిని ఒప్పించి తనయడిని జిల్లా అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు బాజిరెడ్డి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ అధికారికంగా జరిగిన ఎన్నికలో జిల్లా మున్నూరుకాపు అధ్యక్షుడిగా బాజిరెడ్డి జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.