రాజకీయ ఉద్దండులు ఆసీనులై ఉన్న ఆ వేదికపై యువనేత బాజిరెడ్డి జగన్ చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. తనదైన శైలిలో కొనసాగిన స్పీచ్ అందరి ప్రశంసలూ అందుకున్నది. డిచ్‌పల్లి బీఆరెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి అతిథులుగా రాజ్యసభ సభ్యులు, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, జిల్లా పార్టీ ఇన్చార్జి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్, ఎమ్మెల్సీ బండా ప్రశాశ్ ముదిరాజ్ , ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ హాజరయ్యారు. ఈ వేదికగా జగన్ ప్రసంగించిన తీరు ఆకట్టుకున్నది. ఆసాంతం ఆసక్తిగా ఇద్దరు అతిథులు ఆలకించారు. అనంతరం ప్రశంసించారు. కేఆర్ సురేశ్‌రెడ్డి తన ప్రసంగంలో ప్రత్యేకంగా జగన్ గురించి ప్రస్తావిస్తూ అందరి ఆశాజ్యోతిగా అభివర్ణించారు. యువకులకు మంచి స్పూర్తినిస్తున్న నేతగా కూడా చెప్పుకొచ్చారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాబోయే ఎమ్మెల్యే అంటూ ప్రసంగించారు. ఆర్టీసీ చైర్మన్‌గా గోవర్దన్ నిరంతరం అందుబాటులో లేకున్నా.. తమకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అన్ని విధాలుగా జగన్ అండగా ఉంటూ వస్తున్నారని చెప్పడంతో సభలో హర్షద్వానాలు మిన్నంటాయి.
మొదటి పంచ్ మనదే కావాల…
జగన్ తనదైన శైలిలో చేసిన ప్రసంగం యువతలో కొత్త ఊపునిచ్చింది. బాక్సింగ్‌లో గెలిచేందుకు అవతలివాడి పంచ్ పడకముందే మనదే ముందు పడ్డట్టు.. సోసల్ మీడియా వేదికగా అబద్దాల ప్రచారం చేసే బీజేపీకి మనం ఏం చేస్తున్నామో తెలిసేలా మొదటి పంచ్ మనదే ఉండేలా దెబ్బ పడాలంటూ పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా చేసిన అభివృద్ది, అమలవుతున్న సంక్షేమ ఫలాలు వివరించి ప్రజలకు మరింత చేరువ కావలని జగన్ ఇచ్చిన పిలుపు అందరికీ నచ్చింది. కేంద్రం మీద విమర్శలు చేస్తూనే లోకల్ బీజేపీ లీడర్లపై గట్టిగా కౌంటర్ ఇచ్చాడు జగన్. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చింది… నడ్డా,తరుణ్ చుగ్‌లేనని, మరి అప్పుడు ఇవ్వడం సాధ్యపడదనే రూల్ గుర్తు రాలేదా.. ? బుద్ది ఉందా మీకు .. ఇంతటి అబద్దాలకు తెగబడి, రైతులను మోసం చేస్తారా.. ? అంటూ నిలదీసిన వైనం ఆకర్షించింది. బీజేపీని ఇరకాటంలో పెట్టింది. వెన్నుపోటు నేతగా స్థానిక బీజేపీ నేత కులాచారి దినేశ్‌ను పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడిన తీరు లోకల్ లీడర్లకు కనెక్టయ్యింది. దొంగ బాండ్ పేపర్ ఫ్లెక్సీలను ప్రదర్శించి ప్రతీ గ్రామంలో అర్వింద్ ఇజ్జత్ తీయాలని చెప్పడంతో పాటు మీకు దండం పెడతాను.. మీరు జై గోవన్న, జై జగనన్న అని మెసేజ్‌లు పెట్టడం ఆపండి…బీజేపీ వాళ్ల అబద్దాల కౌంటర్లను తిప్పికొట్టేలా ఉన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా , తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టండి అని రెండు చేతులు జోడించి చెప్పడం కూడా బాగా ఆకట్టుకుంది.
మాస్ లీడర్ మాస్ స్పీచ్… మోడీపై సెటైర్లకు నవ్వులే నవ్వులు..
బాజిరెడ్డి గోవర్దన్ ప్రధాని మోడీపై వేసిన పంచ్‌లకు సమావేశంలో నవ్వులు పూశాయి. బర్రెలు గుద్దితే తుక్కు తుక్కయ్యే వందే భారత్ రైలు ప్రారంభానికి మోడీ రావాల్నా.. అంటూ ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
మత విధ్వేషాలను రెచ్చగొట్టి, సోషల్ మీడియా ద్వారా అబద్దపు ప్రచారాలతో పబ్బం గడుపుకునే బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలను బిచ్చగాళ్లను చేస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే జరుగుతున్నదని, మన దగ్గరకు కూలీలుగా వలస వచ్చేది అక్కడి బీజేపీ పాలిత ప్రాంత ప్రజలేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు తెలివివంతులని, ఉద్యమ చైతన్యం కలిగినవారని, బీజేపీని ఇక్కడ పాతరేస్తారని అన్నారు. కన్నతండ్రిలా తెలంగాణ బిడ్డలను చూసుకుంటున్న సీఎం కేసీఆర్‌ను మనమంతా కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఆయన అన్నారు. శనివారం జరిగిన డిచ్‌పల్లి మండల బీఆరెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పార్టీ మండల అధ్యక్షుడు చింతాల శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బాజిరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సంక్షేమ ఫలాలు ప్రతీ కుటుంబానికి అందాయని, గడప గడపకు పథకాలు చేరాయని అన్నారు. ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చి వందే భారత్ రైలును ప్రారంభించడం సిగ్గు చేటన్నారు. దీన్ని ప్రారంభించేందుకు పీఎం రావాలా..? రైల్వే మంత్రి లేడా..? రాష్ట్రంలో కిషన్ రెడ్డి ఉన్నాడు కదా..? బర్రెలు గుద్దితే తుక్కు తుక్కయ్యే ఈ రైలును ప్రారంభించేందుకు పీఎం రావడం సిగ్గుచేటని బాజిరెడ్డి ఎద్దేవా చేశారు.
ఆర్టీసీ 756 కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ను రమ్మంటే రాలేదని, తమనే ప్రారంభోత్సవం చేసుకోమన్నారని, అదీ కేసీఆర్‌కు, పీఎం మోడీకి ఉన్న తేడా అని అన్నారు. బీజేపీ నేతలు ఎంత చీప్‌గా ప్రవర్తిస్తారో , ఎంత పనీ పాట లేకుండా ఉన్నారో దీన్ని బట్టి తెలిసిపోతుందన్నారు. సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెడుతూ బతికే బీజేపీ.. అందుకు కోసం పనిచేస్తున్న యువతకు అదానీ జీతాలు ఇస్తున్నాడని, ఎమీ తెలియని యువత వీరి చెప్పుడు మాటలకు బలైపోతున్నారని అన్నారు. యూత్ బీజేపీ పట్ల ఆకర్షితులు కావొద్దని, వాళ్ల పిల్లలను పెద్ద చదువులు చదివించుకుని, పెద్ద కొలువులు ఇప్పించుకుంటూ.. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇలా రోడ్లపైకి ఉసిగొల్పుతారని, బీజేపీ పట్ల యువత జాగురుకతతో ఉండాలని పిలుపునిచ్చారాయన. సీఎం కేసీఆర్ లాంటి పాలనాధక్షుడి హయంలో మనం సంక్షేమంగా ఉన్నామని, ఇదే విషయాన్ని కాలర్ ఎగరేసి మరీ చెప్పుకోవాలని అన్నారు. తెలంగాణ ఫలాలను దేశానికంతటికీ అందించేందుకు పీఎం అయ్యే ఛాన్స్ ఉన్న కేసీఆర్‌ను దీవించడం, మద్దతుగా ఉండటం మన ధర్మం అని బాజిరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని పీఎం అంటున్నారని, మేం దొంగలకు సహకరించమని ఆయన స్పష్టం చేశారు.
ఈడీ, మోడీ, సీబీఐల బెదిరింపులకు, కవితను అరెస్టు చేస్తామని అంటే సీఎం కేసీఆర్ భయపడడని అన్నారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఎండాకాలం నీళ్లను ట్రైన్ బోగిలలో తరలించాల్సిన దుస్థితి ఉందన్నారు. కర్ణాటకలో కాంట్రాక్టర్ల దగ్గర అక్కడి ఎమ్మెల్యేలు 40 శాతం కమీషన్ గుంజుతారని చెప్పారు. బీజేపీ నేతలు పచ్చి దొంగలని దుయ్యబట్టారు. మోడీ ఏ ఎండాకాగొడుగు పడతాడని, కవితను ఆనాడు మెరా దోస్త్‌కా బేటీ అన్నాడని, ఇప్పుడేమో.. తల్లి చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ ఏర్పాటు పై కడుపుమంటను బయటపెట్టుకుంటున్నాడని , అసలు మోడీకి తెలంగాణలో తిరిగే హక్కేలేదన్నారు. బండి సంజయ్ మాట్లాడితే సీఎం కేసీఆర్ జైలుకు పోతాడని జోకర్‌లా మాట్లాడి .. తనే జైలుకు పోయాడన్నారు. తర్వాత టికెట్ ఎంపీ అర్వింద్‌దని, త్వరలో ఇతనూ జైలుపాలు కాకతప్పదన్నారు. తల్లికోడి తన పిల్లలను కాపాడుకున్నట్టు బీఆరెస్ కార్యకర్తలను తను కాపాడుకుంటానని, ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని బాజిరెడ్డి అన్నారు.
అంతకు ముందు పార్టీ జిల్లా ఇన్చార్జి, మండలి డిప్యూటీ చైర్మన్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రధాని పదవిలో ఉండి తనను చంపాడానికి సుపారి ఇచ్చారంటూ.. సుపారి అనే చీప్ భాషను వాడిన ఘనత మోడీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ చూపిన ఆశయాలకు అనుగుణంగా, అమరవీరుల త్యాగాల స్పూర్తితో పరిపాలన సాగిస్తామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి కట్టే పన్నుల్లో 41 శాతం తిరిగి మనకు చెల్లించాలని కానీ, 29 శాతం కూడా కేంద్రం నిధులివ్వడం లేదన్నారు. రాజ్యసభ సభ్యులు , మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల బీజేపీపై విశ్వాసం కోల్పోయారన్నారు. ఇన్నేళ్లలో కేంద్రం తెలంగాణకు ఒక్క యూనివర్సిటీ కూడా ఇవ్వలేదని, కేసీఆర్ నాలుగేళ్లలో ప్రపంచంలోనే మేటి అయిన కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితమిచ్చాడన్నారు. దేశంలోనే బీఆరెస్‌కు మించిన బలమైన ప్రాంతీయ పార్టీ మరోటి లేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీజీ గౌడ్ మాట్లాడుతూ.. నాందేడ్‌లో జరిగిన సభలతో కేంద్రంలో వణుకు ప్రారంభమైందన్నారు. సిలిండర్ ధరను 400 నుంచి 1200 కు పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచారని, పెట్రోల్, డీజీల్ ధరల పెంపుతో జీవన ప్రమాణాలు తగ్గేలా కేంద్రం ప్రజలపై భారం మోపుతుందని అన్నారు.
ఈ సమ్మేళనంలో ఉమ్మడి జిల్లా ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మండల రైతు కో ఆర్డినేటర్ జీనియస్ నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు శక్కరకొండ కృష్ణ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సాయిలు, యూత్ అధ్యక్షుడు అమీర్, బీఆరెస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లా హరికిషన్, దళిత సంఘం జిల్లా నాయకుడు పద్మారావు, సర్పంచులు, ఎంపీటీసీలు , బీఆరెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.