ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆకుల లలితకు ఇవ్వాలనే యోచనలో బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి.. కేసీఆర్‌ సూచన మేరకు బీఆరెస్‌లో చేరిన ఆమెకు తిరిగి ఎమ్మెల్సీని చేస్తానని కేసీఆర్‌ మాటిచ్చారు. ఈ మేరకు మొన్నటి స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా దాదాపుగా ఆకుల లలిత పేరు ఖరారయింది. కానీ చివరి నిమిషయంలో నాటకీయ పరిణామాల మధ్య ఈ స్థానాన్ని కవితకు ఇచ్చారు. దీంతో లలిత వర్గీయులు, ఆ సామాజిక వర్గానికి చెందిన వారు చాలా నిరాశకు లోనయ్యారు. చాలా రోజుల తర్వాత ఆ అసంతృప్తిని కొంత తగ్గించేందుకు ఉమెన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్ పర్సన్ చేశాడు కేసీఆర్‌. తెలంగాణ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో మున్నూరుకాపుల సంఖ్య గణనీయంగా ఉంది. చాలా చోట్ల ప్రభావశీలురుగా ఆ సామాజికవర్గానికి చెందిన ఓటర్లున్నారు.

ఈ క్రమంలో ఆమెకు మున్నూరుకాపు రాష్ట్ర మహిళా అద్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఆ హోదాలో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా వనభోజనాల కార్యక్రమాలను నిర్వహించారు. అందరికీ ఒక్క తాటిపైకి తెచ్చారు. ఈ పరిణామాల నేపథ్యం ఆమెకు కలిసి వచ్చింది. సీఎం కేసీఆర్‌ కూడా ఆమె సేవలపై ప్రత్యేక నజర్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఆమెకు ముందుగా ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీగా చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె సేవలు వినియోగించుకోవచ్చనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి తోడు నిజామాబాద్‌ జిల్లాలోని పలు సెగ్మెంట్లలో మున్నురుకాపులు బీజేపీ వైపు చూస్తున్నారు. అర్వింద్‌ క్రమంగా బలం పుంజుకోవడం, జిల్లా వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసేందుకు మున్నూరు కాపు సామాజికవర్గాన్ని తనవైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు.

డీఎస్‌ రాజకీయాలకు దూరమైన తర్వాత రాజకీయంగా అంతగా బలంగా ఉన్న నేతలెవ్వరూ లేకపోవడం, ఆ సామాజికవర్గానికి ఆకుల లలిత అందుకు ప్రత్యామ్నాయంగా కనిపించడం కూడా కేసీఆర్‌ గుర్తించారు. ఆకుల లలితకు ఎమ్మెల్సీ ఇస్తే జిల్లాలో కూడా బీఆరెస్‌ పార్టీకి మున్నూరుకాపుల తోడు అదనపు బలాన్నే కాక.. చాలా చోట్ల అభ్యర్థుల గెలుపుకు కీలకభూమికగా పనిచేస్తుందని అధినేత అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అర్విందుకు, ఇందూరు బీజేపీకి కూడా గట్టిగా చెక్‌ పెట్టి, తిరిగి బీఆరెస్‌కు ఇందూరు జిల్లాను కంచుకోటలా మార్చేందుకు ఎంతో దోహదం చేస్తుందనే సమాలోచనలూ ఆయన చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

You missed