మలిదశ ఉద్యమాన్ని జయశంకర్ సార్ అండతో కెసిఆర్ ప్రారంభించినపుడు ఆయనతో కలిసి ఉద్యమంలో అడుగులు వేసింది మొదట జర్నలిస్టులే..! ప్రతికూల యాజమాన్యాలు ఉన్నప్పటికీ వెరవకుండా ఒకవైపు ఉద్యమ కథనాలు రాస్తూనే మరోవైపు క్రియాశీల ఉద్యమంలో జర్నలిస్టులు చురుకైన పాత్ర పోషించారు. రాజకీయ పరిస్థితులవల్ల టీఅర్ఎస్ కెసిఆర్ బలహీనపడి ఉద్యమాన్ని నడిపించలేని స్థితిలో ఉన్న పలు సందర్భాల్లో ప్రజల్లో ఉద్యమవేడిని కొనసాగించడానికి జర్నలిస్టులు చేసిన నిర్విరామ కృషి అనితర సాధ్యమైనది.. ఈ క్రమంలో యాజమాన్యాల ఆగ్రహానికి గురై ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డునపడ్డప్పటికీ జర్నలిస్టులు తమ సంకల్పాన్ని వీడలేదు. భవిష్యత్ తరాల బాగుకోసం ఎంతటి త్యాగానికైనా సిద్దపడి తెగువ చూపారు.. ప్రజలను చైతన్య పరుస్తూ ఉద్యమంలో ముందుకు నడిచారు..! ఉద్యమ కార్యక్రమాలని కవర్ చేసే క్రమంలో లాఠీ దెబ్బలుతిని గాయపడిన ఉద్యమ జర్నలిస్టుల సంఖ్య రాష్ట్ర వ్యాపితంగా వేలల్లో ఉంటుంది.. పదుమూడేళ్ల సుదీర్ఘ పోరాటంలో జర్నలిస్టుల క్రియాశీలక పాత్ర వల్లే తెలంగాణ ఉద్యమాన్ని దేశం సహా ప్రపంచం గుర్తించింది..! జర్నలిస్టులు లేకపోతే ఉద్యమమే లేదు..! రాజకీయ స్వార్థం కుట్రల వల్ల మధ్యలోనే ఆగిపోయేదే..! తెలంగాణను రాజకీయ కుట్ర తో అడ్డుకునే ప్రయత్నం జరిగినపుడల్లా ఆ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిన ఘనత ముమ్మాటికీ జర్నలిస్టులదే ..! చివరికి నిరాహార దీక్షకు ఉపక్రమించిన కెసిఆర్ ను అంతమొందించడానికి కుట్ర జరుగుతుందనే ప్రచారంతో పూర్తిగా అప్రమత్తమై ఖమ్మం వేదికగా జరిగిన ప్రయత్నాలకు పూర్తిగా అడ్డునిలిచి ఎదుర్కొన్నది కూడా జర్నలిస్టులే..!

2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణ ను అడ్డుకోడానికి శ్రీకృష్ణ కమిటీని తీసుకువచ్చి ఎలాంటి అడ్డంకులు కల్పిస్తున్నారో.. కమిటీ ప్రతినిధులను కొనుగోలు చేసి తప్పుడు నివేదిక ఇచ్చేలా ఎలాంటి కుట్రలు జరిగాయో ఎప్పటికప్పుడు ప్రజలకు పూసగుచ్చినట్లు వివరిస్తూ అప్రమత్తం చేసింది జర్నలిస్ట్ సమాజమే..! నిరాహార దీక్షకు దిగిన కేసీఆర్ ను ఖమ్మం హాస్పిటల్ కు తరలించినపుడు జర్నలిస్టులు లేకుండా ఉండిఉంటే పోలీసుల చెరలో ఉన్న అయన ప్రాణాలతో బయటకి వచ్చేవారే కాదని అప్పట్లో అందరు చెప్పేవారు. అటు ఖమ్మంలో ఇటు హైదరాబాద్ లో రాత్రంతా కొనసాగిన హైడ్రామాలో చివరికి నాటి మానవహక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ సుభాషిణ రెడ్డి చేత ఆదేశాలు జారీచేయించి ఖమ్మం నుండి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కు కెసిఆర్ ను సురక్షితంగా తరలించేలా కృషి చేసింది… ప్రతీ అంశాన్ని ప్రజలకి అనుక్షణం తెలియచేసింది కూడా జర్నలిస్టులే..! ఒక విదంగా కెసిఆర్ కు ప్రాణభిక్ష పెట్టింది జర్నలిస్టులే అని చెప్పవచ్చు..!

ఖమ్మం లో నాడు రాత్రంతా కొనసాగిన పరిణామాల్లో జర్నలిస్టుల పాత్ర ఏంటో ఒక్కసారి కెసిఆర్ హరీష్ రావు గుర్తు తెచ్చుకోవడం మంచిది..! దిక్కుతోచని స్థితిలో అర్థరాత్రి బషీర్ బాగ్ నగర పోలీస్ కార్యాలయం గేటువద్ద నిలబడి కెసిఆర్ కు ఏమవుతుందో అని ఏడ్చిన హరీష్ రావు.. నాడు జర్నలిస్టులు తనకు అండగా ఉండి దైర్యం నింపి హెచ్చార్సీ చైర్మన్ వద్దకి తీసుకునివెళ్ళిన విషయాన్ని మరిచిపోయి ఉంటారు! అధికార రాజభోగంలో ఇపుడు వాళ్ళకి జర్నలిస్టులు కంటికి కనిపించకుండా పోయారేమో..!

సకలజనులు సంఘటితంగా నడిచి సాధించుకున్న విజయాన్ని మొత్తంగా తన ఖాతా లో వేసుకున్న కెసిఆర్ అధికారంలోకి రాకముందు ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రను ఆకాశానికెత్తి కీర్తించారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత పాతాళానికి పడేసారు.! సొంత రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతికేలా మెరుగైన జీవన వసతులు కల్పిస్తామని చెప్పి హీనాతి హీనంగా వ్యవహరించారు. డబల్ బెదురూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి స్థలాల కేటాయింపు దాట వేశారు. వివాదాల్లో ఉన్న స్థలాలను చూపి రాజకీయం చేసారు.
హెల్త్ కార్డులు అంటూ చెల్లుబాటుకాని కార్డులు ఇచ్చి దగా చేసారు.. మొత్తంగా హామీలన్నీ ఎదో ఒక సాకుతో దాటవేస్తూ మోసపూరిత వైఖరి ప్రదర్శించారు కెసిఆర్!

గత తొమ్మిదేళ్లలో జర్నలిస్టుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి స్పందించిన తీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పదే పదే అవే హామీలను వల్లెవేస్తూ మోసం చేసిన తీరు పచ్చి ద్రోహం కిందే పరిగణించాల్సి ఉంటుంది. ఒకరిద్దరికి పీఆర్వో పోస్టులు ఓ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాదిమంది జర్నలిస్టులకు న్యాయం చేసినట్లు అవుతుందా ?
నీ రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ద్రోహులకు అధికారంలో వాటా కల్పించి అందలమెక్కించి.. సుదీర్ఘ పోరాటంలో ప్రాణాలకు తెగించి రక్తం చిందించి..నిన్ను అనుక్షణం కాపాడుకుంటూ రక్షణగా నిలిచిన జర్నలిస్టులకు ద్రోహం చేస్తావా ? అధికారంలో వాటా.. మెరుగైన జీవనం పొందడం జర్నలిస్టుల హక్కు .. నువ్వు ఇచ్చే వరం కాదు..! రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రగతి పథంలో నడవాలి అభివృద్ధి తెలంగాణ సాకారం కావాలనే లక్ష్యంతో కెసిఆర్ ప్రభుత్వానికి జర్నలిస్టులు సహకరిస్తూ వస్తున్నారు.. ఎన్ని అవమానాలు ఎదురైనా… హామీలను నెరవేర్చకుండా మోసం చేసినా సహనంతో సహకరిస్తూనే ఉన్నారు. ఇది చేతకాని తనంగా భావిస్తే కెసిఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు..!

▫️ ఎందుకింత అహంభావం ?

ఏ ఖమ్మం గడ్డమీద తన ప్రాణాలకు రక్షణగా నిలిచారో అదే ఖమ్మం గడ్డపైన జర్నలిస్టులను అవమానించేలా కెసిఆర్ అహం ప్రదర్శించడం అత్యంత దురదృష్టకరం. అదేదో వాళ్ళు అడగకూడనిది అడిగినట్లు.. ఈయనేదో తన ఆస్థి పంచుస్తున్నట్లు జిల్లా మంత్రి.. హరీష్ రావ్ అదేందో సూడండి..! అన్నట్లుగా కెసిఆర్ మాట్లాడిన తీరు ఆయనలోని అధికార అహంభావానికి అద్దం పట్టింది..! అంతకంటే ఆశ్చర్యమేంటంటే.. అసలు తనకు అదేం గుర్తులేనట్లుగా కెసిఆర్ ప్రదర్శనిచ్చిన నటన అభ్యన్తరకరమైనది..! కెసిఆర్ గారు మేము అడిగితేనే మీరు స్పందిస్తారా? మీకు మీరుగా ఈ విషయంపై మాట్లాడరా ? మీరు ప్రెస్సుమీట్లు పబ్లిక్ మీటింగులు పెట్టిన ప్రతి సందర్భంలో జర్నలిస్టులు కనిపిస్తున్నారు కానీ వారి సమస్యలు… మీరు ఇచ్చిన హామీలు కనిపించడం లేదా ? రేపో మాపో ఎన్నికలకు వెళ్ళడానికి సమాయత్తం అవుతున్నారు. ఇంతకీ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఆలోచన ఉందా లేదా తేల్చాల్సిన సమయం వచ్చింది.. కూడా కూడా ఆచరణలేకుండా హామీలతో మభ్యపెట్టాలని చూస్తే జర్నలిస్ట్ సమాజం ఆగ్రహానికి గురికాక తప్పదు !
▫️▫️▫️▫️
Shyamasundar Akula
NEW SENSE
9010746999

You missed