తనకు ఏ పాపం తెలియదు. కష్టపడి, నిజాయితీగా పైకొచ్చాడు. తెలంగాణ హీరోగా ఒక్కో మెట్టే ఎక్కుతున్నాడు. చేసింది కొన్ని సినిమాలే. అయినా తనకంటూ ఓ ప్రత్యేకత. మ్యానరిజం. డైలాగ్‌ డెలివరీ. డేరింగ్‌ పర్సనాలిటీ, ముక్కుసూటిగా పోయే తత్వం… బహుశా ఈ తత్వమే అతని బలం, బలహీనత కూడా. ఇదంతా నాణానికి ఓ వైపు. విభిన్న చిత్రాలు తీస్తూ ఎప్పటికప్పుడు తనలోని నటనను సానబడుతున్న హీరో విజయ్‌ దేవరకొండకు… రాజకీయాలు ఆనకొండలా చుట్టేశాయి. తను పాన్‌ ఇండియా సినిమా లైగర్… అతని సినీ కెరీర్‌కే ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. హిట్లూ, ప్లాపులు సర్వసాధారణం. లైగర్‌ కూడా అంచనాలు తారు మారు చేసి బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పాలైంది.

అంతకు మించిన దెబ్బ… రాజకీయాలు ద్వారా తగులుతోంది విజయ్‌కు. ఈ సినిమాలో రాజకీయ పెద్దలు పెట్టుబడులు పెట్టారనేది అభియోగం. దీనిపై విజయ్‌ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఇప్పుడు ఈ రాజకీయ చిక్కుముడులు, ఎత్తుకు పై ఎత్తులు.. ఈ హీరో మెడకు, కాళ్లకు చుట్టుకున్నాయి. మింగలేక, కక్కలేక అన్నట్టుగా అయ్యింది విజయ్‌ పరిస్తితి. ఓ వైపు సినీ కెరీర్‌ను ఇప్పుడిప్పుడే గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న విజయ్‌కు … రాష్ట్ర, దేశ రాజకీయాల నడుమ సాగుతున్న బల ప్రదర్శనకు తను బలైపోతున్నాడు. సినీ కెరీర్‌ను పణంగా పెడుతున్నాడు.

You missed