కవిత సౌమ్యురాలు. ఎంపీగా ఓడిన తర్వాత ఆమె చాలా కాలం రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. చాలా రోజుల తర్వాత స్థానిక సంస్థల ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఎన్నిసార్లు ఆమెపై ఆరోపణలు చేసినా పెద్దగా స్పందించలేదు. పట్టించుకోలేదు. మొన్నామధ్య నిజామాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి పసుపుబోర్డు గురించి నిలదీశారు. ఇక రైతులపక్షాన పోరాటం.. ప్రశ్నించడం మొదలు పెడతామని అల్టిమేటం కూడా ఇచ్చారు. కానీ ఈరోజు ఆమె కాళికావతారం ఎత్తారు.
మొన్న కేసీఆర్ .. బీజేపీ తన కూతురు కవితను కూడా బీజేపీలోకి రావాలంటూ ఆఫర్ ఇచ్చిన విషయాన్ని చెప్పడం కలకలం రేపగా.. దీన్ని అర్వింద్ వక్రీకరించి కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ తో కవిత కలిసి మాట్లాడారంటూ ఓ కామెంట్ విసిరాడు. ఇదీ ఆమె కోపం నశాళానికి అంటడానికి కారణమైంది. ఈ రోజు ఆమె హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ఎడాపెడా చెడామడా తిట్టిపోశారు. చౌరస్తాపై చెప్పుతో కొడతానని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను చీటింగ్ చేశావని, ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ పొందావని ధ్వజమెత్తారు. ఎక్కడి నుంచి పోటీ చేసినా వెంటాడి వేటాడి ఓడిస్తానని కూడా ఈ వేదికగా ఆమె సవాల్ విసరడం రాజకీయంగా దుమారం రేపింది. ఆమె త్రీవస్థాయిలో మండిపడటంతో….. ఆవేశానికి లోనైన కార్యకర్తలు అర్వింద్ ఇంటిపై దాడి చేశారు. ఇది మరింద దుమారం రేపింది.
ఇక్కడ నిజామామాద్‌లో అర్వింద్ దిశ మీటింగులో ఉన్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. తను ఆరోపణలు చేస్తే తిప్పి కొట్టాలి కానీ తన తల్లి ఉన్న ఇంట్లోకి వెళ్లి దాడి చేయడం తగునా అని నిలదీశాడు. ఇంట్లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నించాడు. పోటీ చేస్తే ఆహ్వానిస్తున్నానని, తనపై ఎలాంటి కేసులై నా పెట్టుకోవచ్చంటూ మట్లాడాడు. దీంతో పొలిటికల్ వార్ ఒక్కసారిగా వేడెక్కింది. ఇందూరులో రాజకీయాలు భగభగమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇది కలకలం రేపింది. రాజకీయాల్లో కొత్త చర్చకు తెర తీసింది.