ఇందూరు బీజేపీ ఇప్పుడు అర్వింద్ బీజేపీగా మారింది. ఒకప్పుడు ఉన్న పార్టీ కాదిప్పుడు. అది మొత్తం అర్వింద్ చేతిలోకి వెళ్లింది. నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ గెలిచిన నాటి నుంచి తను పూర్తిగా పార్టీని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఏ నియోజకవర్గం నుంచి తన వ్యక్తుల్ని ఎవర్ని పోటీలో ఉంచాలో అంతా తనే డిసైడ్ చేస్తాడు. అధిష్టానం కూడా అర్వింద్ ఇష్టాయిష్టాలపైనే ఇందూరు బీజేపీని వదిలేసింది. దీంతో అర్వింద్ చెప్పిందే వేదమిక్కడ. కానీ పార్టీనే నమ్ముకుని ఉన్న నేతలు, యెండల లక్ష్మీనారాయణ వర్గానికి ఇది మింగుడు పడటం లేదు. మొన్న మొన్న వచ్చిన అర్వింద్ బీజేపీని కబ్జా చేసేసి ఇప్పుడు తమను ఆ పార్టీలోనే పరాయివాళ్లను చేసి చూడటం తట్టుకోలేకపోతున్నాడు.
ఇప్పటికే బీజేపీ సీనియన్ నేత యెండల లక్ష్మీనారాయణను పూర్తిగా పార్టీ పరంగా తొక్కేశాడు అర్వింద్. అతన్ని కనీసం బీజేపీ పార్టీ కార్యాలయానికి కూడా పిలవడం లేదు. ప్రెస్‌మీట్లలో పాల్గొనడం లేదు. పైగా తన అనుచరులను ఒక్కొకరిగా చెక్ పెడుతూ వస్తున్నాడు. పటేల్ ప్రసాద్‌పై పార్టీ నుంచి వేటు వేయించాడు. ఆ కేసుల సాకును చూపి నేరుగా అర్వింద్‌పై దాడి చేయకుండా యెండల వర్గం .. టీఆరెస్ కేసులు బనాయించిందని మొన్న ర్యాలీ తీశారు. వాస్తవానికి ఇది అర్వింద్‌పై యెండల వర్గం బల ప్రదర్శన అనే చెప్పాలి. ఈ ర్యాలీలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. వాస్తవానికి ఈ ర్యాలీకి వినయ్‌రెడ్డికి సంబంధం లేదు. కానీ యెండల పంచన చేరానని చెప్పడానికే ఇందులో పాల్గొన్నాడు. కారణం… ఆర్మూర్ లో ఇక తనకు పోటీకి అవకాశం లేదని అతని తెలిసిపోయింది.
ఇక్కడి నుంచి అర్వింద్ తను లేదా.. వ్యాపారవేత్త రాకేశ్‌రెడ్డిని పోటీలో దింపాలని యోచనలో ఉన్నాడు. వినయ్‌రెడ్డి ఆర్మూర్ ఇన్‌చార్జి కాదని, అక్కడ అల్జాపూర్ శ్రీనివాస్‌తో ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పించాడు అర్వింద్. రెండు పర్యాయాలు ఆర్మూర్ నుంచి పోటీ చేసి .. మూడోసారీ అదృష్టాన్ని పరీక్షించుకుందామని చూసిన వినయ్‌రెడ్డికి చేదు అనుభవమే మిగిలింది.అందుకే యెండల పక్షం నిలిచాడు. ఇప్పుడు ఇదే వరుసలో చాలా మంది యెండల పంచన చేరేందుకు సిద్దమయ్యారు. వీరంతా అర్వింద్ బాధితులు. పార్టీని వదలి వెళ్లలేని పరిస్థితి. ఇందులో ఇమడలేని పరిస్థితి. అర్వింద్ ఇక్కడ బలంగా ఉనన్ని రోజులు, అధిష్టానం అతనికి వంతపాడినన్ని రోజులు.. తమ రాజకీయ ఉనికే ప్రశ్నార్థకం అనేది వారికి క్లారిటీ వచ్చేసింది. దీంతో ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉన్న వారికి యెండల లక్ష్మీనారాయణ .. అసమ్మతి నేతలందరికీ సారథ్యం వహించడానికి ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఇందూరులో అర్వింద్ బీజేపీ, యెండల బీజేపీ అని రెండు వర్గాలుగా మారాయి.