నిజామాబాద్ జిల్లాలో అర్వింద్‌, యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ గ్రూపుల లొల్లి రోడ్డుకెక్కింది. ఎంపీగా అర్వింద్ గెలిచిన నాటి నుంచి యెండ‌ల‌ను, ఆయ‌న వ‌ర్గాన్ని దూరం పెడుతూ వ‌చ్చాడు. దీంతో ఆయ‌న్నున‌మ్ముకున్న వ‌ర్గ‌మంతా చాలా రోజులుగా నిరుత్సాహంతో ఉన్నారు. పార్టీలో బ‌ల‌వంతంగా కొన‌సాగుతున్నారు. భాయ్‌సాబ్ కు మంచి రోజులు రాక‌పోతాయా..? అని ఎదురు చూడ‌టం త‌ప్ప‌.. పార్టీలో గౌర‌వం లేదు. ప‌ద‌వులు లేవు. ఉనికే కోల్పోయే ప‌రిస్థితికి వ‌చ్చారు. యెండ‌ల‌కు ప్ర‌ధాన అనుచ‌రుడు ప‌టేల్ ప్ర‌సాద్‌.

అర్వింద్ ప‌ట్టించుకోకున్నా.. ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోయినా.. త‌నే సొంతంగా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ఏదో ఒక విధంగా వార్త‌ల్లో ఉండేవాడు. మొన్నామ‌ధ్య పార్టీ రాష్ట్ర క‌మిటీలో ప‌టేల్ ప్ర‌సాద్‌కు అవ‌కాశం కూడా వ‌చ్చేలా చేశాడు యెండ‌ల‌. కానీ ఇది జ‌రిగిన కొన్ని రోజుల‌కే ఓ కేసులో ప‌టేల్ ప్ర‌సాద్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు జిల్లా పార్టీ ప్ర‌క‌టించింది. ఈ కేసు కావాల‌నే అర్వింద్ పెట్టించాడ‌ని, పార్టీ నుంచి వెళ్ల‌గొట్టేందుకే ఇదంతా చేశాడ‌ని యెండ‌ల వ‌ర్గం బాహాటంగానే ప్ర‌చారం చేసుకున్న‌ది. అయినా ప‌టేల్ ప్ర‌సాద్ పార్టీ లో లేకున్నా కొన్ని కార్య‌క్ర‌మాలు చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వ‌చ్చాడు.

న‌గ‌రంలోని శంభుని గుడిని ఆనుకొని అన్య‌మ‌త‌స్తులు చెప్పుల దుకాణాలు పెట్టార‌ని, ల‌వ్ జిహాదీ పేరుతో హిందూ అమ్మాయిల‌కు వ ల వేసి అన్యాయం చేస్తున్నార‌నే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ ఎప్ప‌టికప్పుడు వార్త‌ల్లో ఉంటున్నాడు. అనుకోకుండా ఈవాళ ప‌టేల్‌పై అక్రమ కేసుల పేరుతో యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ రోడ్డెక్కాడు. యూత్‌తో క‌లిసి ర్యాలీ తీశాడు. అర్బ‌న్ ఎమ్మెల్యే గ‌ణేశ్ గుప్తా ప‌టేల్‌పై అక్ర‌మ కేసులు పెట్టించాడ‌ని ఫ్ల‌కార్డుల ప్ర‌ద‌ర్శించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వాస్త‌వంగా యెండ‌ల‌ను, ఆయ‌న వ‌ర్గాన్ని తొక్కిపెట్టింది అర్వింద్‌. ఇక పార్టీలో భ‌విష్య‌త్ లేదు అనే విధంగా యెండ‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేస్తూ వ‌స్తున్నాడు అర్వింద్‌.

కానీ అర్వింద్ పై బాహాటంగా మాట్లాడ‌లేని యెండ‌ల‌… ఇప్పుడు ప‌టేల్ ప్ర‌సాద్ ను ముందు పెట్టుకుని టీఆరెస్‌ను టార్గెట్ చేస్తున్నామ‌నే నెపంతో త‌న వ‌ర్గంతో నిజామాబాద్‌లో బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగాడు. రాబోయే ఎన్నిక‌ల్లో అర్బ‌న్ నుంచి ఎమ్మెల్యేగా లేదా.. నిజామాబాద్ ఎంపీగా నైనా త‌న‌కు అవ‌కాశం రావాల‌ని యెండ‌ల భావిస్తున్నాడు. కానీ ఇప్పుడంతా అర్వింద్‌దే హ‌వా. యెండ‌ల‌కు ఏ అవ‌కాశం రాకుండా ఢిల్లీ స్థాయిలో చ‌క్రం తిప్పే బ‌లం స‌మ‌కూర్చుకున్నాడు అర్వింద్‌. దీంతో త‌న ఉనికే ప్ర‌శ్నార్థ‌కంగా మారే ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించిన యెండ‌ల ఇలా త‌న వ‌ర్గంతో రోడ్డెక్కాడు. రాష్ట్ర పార్టీ త‌న ఆవేద‌న‌ను గుర్తించాల‌నే త‌ప‌న ఓ వైపు… అర్వింద్‌పై పెత్తనం సాగించి.. త‌నూ పార్టీలో ఉన్నాన‌నే ఉనికి చాటుకునే తాప‌త్ర‌యం ఓ వైపు క‌నిపించాయి.

You missed