ఆరోజంతా అంతా ద‌స‌రా పండుగ చేస్కుంటుంటే… న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగులు మాత్రం డ్యూటీ చేస్తారు. కేసీఆర్ అదే రోజు జాతీయ పార్టీపై ప్ర‌క‌ట‌న చేయ‌నున్న నేప‌థ్యంలో న‌మ‌స్తే తెలంగాణ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. అస‌లే తెలంగాణ‌లో అది పెద్ద పండుగ‌. ఆ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ కూర్చున్న ఉద్యోగుల‌కు ఇవాళ వాళ్ల మేనేజ్‌మెంట్ వాళ్ల ప‌క్క‌లోనే బాంబ్ వేసింది. ఆ రోజు మ‌న‌కు పండుగ హాలీడే లేదు. రావాల్సిందే అంతా. ఎందుకంటే… ఇదీ సంగ‌తి..!! అని చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పింది. ఫాఫం.. మ‌న న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగుల ముఖాలు మాడిపోయాయి. పాలిపోయిన వ‌ద‌నాల‌తో ఒక‌రి ముఖాలు ఒక‌రు చూసుకున్నారు. ఇదెక్క‌డి లొల్లిలా నాయ‌న‌.. ఆయ‌న జాతీయ రాజ‌కీయాల‌కు పోవుడేందీ..? ద‌స‌రా రోజే పార్టీ ప్ర‌క‌ట‌న ఏందీ..? మ‌ధ్య‌లో ఇది మా చావుకొచ్చిందేందిరా నాయ‌న‌..!! పండుగ పూట పెండ్లాం పిల్ల‌ల‌తో హాయిగా గుడ‌పుదామంటే ఆ ఒక్క రోజూ కేసీఆర్ జాతీయ రాజ‌కీయాలు గుంజేసుకున్నాయి..? అని వాపోతున్నార‌ట‌. అంతా ఇదే చ‌ర్చ ఆఫీసులో. వ‌చ్చేదే అర‌కొర సెల‌వులు. అందులో పెద్ద పండుగ‌. ఆ రోజూ డ్యూటీయే ఉంటే… ఇంత‌క‌న్నా పెద్ద న‌ర‌కం ఏముంటుంది బై. అనుకుంటున్నార‌ట చాయ్‌ల మీద చాయ్‌లు తాగుతూ.. సిగ‌రెట్ల మీద సిగ‌రెట్లు ఊదుతూ.. ప్ర‌స్టేష‌న్‌లో.

అవునూ… దీపావ‌ళి రోజున కూడా ఏదైనా జాతీయ రాజ‌కీయాల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న‌… ఏదో ప‌థ‌కం.. ఏదో హామీ.. ఇంకేదో శ‌ప‌థం… మ‌రేదో స‌వాలు……. ఇలాంటివేమీ ఉండ‌వు క‌దా..!! ఆ పండుగ సెల‌వు కూడా జెల్ల కొట్టరు క‌దా….

సిగ‌రెట్టు తాగుతూ మ‌ధ్య‌లో ఆపి ఆక‌స్మాత్తుగా ఒక‌డికి డౌటొచ్చింది. అదే అడిగాడు.

అంద‌రూ ఒక‌రు ముఖాలొక‌రు చూసుకున్నారు. కొద్ది సేపు మౌనం… ఆ త‌ర్వాత పే…ద్ద‌గా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు ప‌డి. ఒక‌ర్నొక‌రు కొట్టుకుంటూ.. కానీ ఆ న‌వ్వులో జీవం లేదు. వైరాగ్యం క‌నిపించింది.

You missed