కాంగ్రెస్ ముక్త్ భారత్.. ఇది బీజేపీ ప్రధాన రాజకీయ లక్ష్యం. ఆ దిశలో పావులు కదిపిన ఆ పార్టీ లక్ష్యసాధనలో చాలావరకు సఫలమైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కంచుకోటలలో పాగా వేసింది. కాంగ్రెస్ ను కోలుకొని విధంగా దెబ్బతీసి కాషాయ జెండాను ఎగరవేసింది. ఇక దేశంలో బీజేపీకి మరో ప్రత్యామ్నాయం లేదన్న రీతిలో రాజకీయ చక్రం తిప్పింది. ఇదే క్రమంలో తెలంగాణ అధికార పీఠంపై కన్ను వేసిన బీజేపీ తమకు అడ్డుగా ఉన్న కాంగ్రెస్ ను కోలుకోని విధంగా దెబ్బతీసి టిఆర్ఎస్‌ను ఓడించాలంటే తమకే చెల్లుతుందని బల నిరూపణ చేసుకోవడానికి బిజెపి అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తున్న ది.

దీనికి త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికను వేదికగా ఎంచుకుంటున్నది. మొదట కాంగ్రెస్ పై ముప్పేట‌ దాడి మొదలుపెట్టినది. ఒకవైపు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ ను టార్గెట్ చేస్తూనే ఇక కాంగ్రెస్ పని అయిపోయిందనే వాదనను ప్రజలలోకి బలంగా తీసుకుపోవడా నికి ఎత్తులు వేస్తున్న ది. తమకు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ ను మొదట మట్టి కరిపించడం ద్వారా ఫైనల్లో టిఆర్ఎస్ ను ఓడించి తెలంగాణలో అధికారం దక్కించుకోవాలన్నా కోణంలో వేగంగా పావులు కదుపుతున్నది . ఈ క్రమంలో మునుగోడు ఉపఎన్నిక ను బీజేపీ అధిష్టాన వర్గం సవాల్ గా తీసుకుంటున్నది.

నిజానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా మొదటినుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. త్వరలో ఉప ఎన్నిక జరగబోయే మునుగోడు లో కూడా కాంగ్రెస్ కు మంచి పట్టు ఉన్నది. వాస్తవానికి నల్లగొండ రాజకీయాలలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ప్రత్యేక ముద్ర ఉంది.
అవకాశవాద రాజకీయాలు , అస్థిర నిర్ణయాలు అని ఆరోపణలు కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తల్లో వారికి బలమైన ప్రాబల్యం ఉంది. ఆ బ్రదర్స్ లో రాజగోపాల్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి కొత్త బలం తోడైనట్లైంది. కానీ రాజగోపాల్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడానికి బలమైన కారణాలు ఏమిటనేది ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. ఇది హుజూరాబాద్ లాంటి ఎన్నిక కాదు. టిఆర్ఎస్ అధిష్టాన వర్గం తప్పిదం వల్ల , అధినాయకుడి కుట్రల వల్ల ఈటెల బలయ్యారని ప్రజలలో సానుభూతి పెల్లుబికింది.

అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా, వరాల జల్లు కురిపించినా, నగదును పుట్నాల పప్పులా పంచి పెట్టినా జనం ఈటెల పక్షాన నిలిచారు. బీజేపీని గెలిపించారు. కానీ మునుగోడులో అటువంటి పరిస్థితి ఉండదు. కొంత భిన్నంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపును సాధించాలంటే మామూలు విషయం కాదనేది బీజేపీకి తెలుసు. రాజగోపాల్ రెడ్డిలో కూడా తెలియని భయం కొంత కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా గెలవాలంటే మొదట కాంగ్రెస్ అడ్రస్సును గల్లంతు చేయాలి. అప్పుడైతే స్ట్రెయిట్ అండ్ స్ట్రీట్ ఫైట్లో విన్నింగ్ షాట్ కొట్టవచ్చు అన్నది బీజేపీ వ్యూహం.

ఈ పరిస్థితులలో బీజేపీ కాంగ్రెస్ పై ముప్పిట దాడి మొదలు పెట్టింది. ఒకవైపు కాంగ్రెస్ రథసారథి రేవంత్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మరోవైపు కాంగ్రెస్ కు ప్రజలలో అడ్రస్ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నది. ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి పూర్తిగా రేవంత్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయగా సీనియర్ నాయకులు డీకే అరుణ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రేవంత్ తో పాటు కాంగ్రెస్ పార్టీపై ప్రధానంగా గురి పెట్టారు. కాంగ్రెస్ పార్టీది నీచ చరిత్ర అని ఈటల తీవ్ర పదజాలంతో ఎండగట్టారు. బీజేపీ నాయకులు వరుసగా కాంగ్రెస్ పై కాలు దుయ్య‌డం వెనుక అధిష్టానం ఆదేశాలు ఉన్నట్లు సమాచారం.

వాస్తవానికి రేవంత్ రెడ్డి సారధ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన దూకుడు కాంగ్రెస్ కు ఊపు తెచ్చిందన్నది వాస్తవం. కానీ అదే సమయంలో ఆయన దుందుడుకు స్వభావం పార్టీ సీనియర్ నాయకులకు ఇరకాటంగా, అప్పుడప్పుడు పార్టీ అధిష్టాన వర్గానికి సంకటంగా మారుతున్న‌ది. కాంగ్రెస్ లో చాలామంది అగ్ర నాయకులు అధికార పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉన్నారని వారు పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారని ప్రజలలో చులకనయ్యారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచేవారు చాలా సులభంగా కండువాలు మార్చుకుంటారనే అపవాదు ఆ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. రేవంత్ రెడ్డి కొంత మార్పు చేయడానికి ప్రయత్నించినా పార్టీ నాయకులలో ఆశించిన మార్పు రాలేదు. టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా పార్టీ 19 నియోజకవర్గాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీలో చివరకు మిగిలింది ఐదుగురు మాత్రమే. మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, వీరయ్య అందులో ఉన్నారు. ఇక మొన్నటి వరకు జగ్గారెడ్డి పార్టీలో ఉంటాడా… వెళ్లిపోతాడా అనే విషయంపై పెద్ద పొలిటికల్ డ్రామా జరిగింది. ఆయన వైఖరి ఇంకా స్పష్టంగా లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఇక రాష్ట్రంలో జరిగిన నాలుగు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తన ఉన్న బలాన్ని కూడా కోల్పోయింది. దుబ్బాక, హుజూరాబాద్ లో బిజెపి, నాగార్జునసాగర్, హుజూర్ న‌గ‌ర్‌ లో టిఆర్ఎస్ పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు హుజూర్ న‌గ‌ర్‌ను కోల్పోయింది. అప్పటి నుంచి బిజెపి నాయకులు టిఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయ‌మంటూ గల్లా ఎగురవేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాదులో భారీ ఎత్తున మోడీ సభను ఏర్పాటు చేసి బల ప్రదర్శన జరిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబం పై వ్యక్తిగత ఆరోపణలతో పాటు పాలక పక్షంపై ఘాటుగా అస్త్రాల‌ను సంధిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రథసారథి బండి సంజయ్ కి మూడోసారి ప్రజా యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బిజెపి తెలంగాణలో అధికారం కోసం ఎంత సీరియస్ గా ఉందో స్పష్టమవుతున్నది. ఇంత జరిగినా తెలంగాణ రాష్ట్ర ప్రజలలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎవ‌రు అనే విషయంపై ఇంకా అస్పష్టత ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బిజెపి మధ్య చీలిపోతే టిఆర్ఎస్ కు లాభిస్తుందనే ది వాస్తవం. కానీ కాంగ్రెస్ టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాదని ఆ పార్టీకి కాలం చెల్లిందని నిరూపించడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతుంది…?

మ్యాడం మధుసూదన్…సీనియర్ పాత్రికేయులు..

You missed