కరోనా గురించి మనం ఇప్పుడు మరిచిపోయాం. అది ఎంతో మందిని పొట్టనబెట్టుకుంది. కుటుంబాలను రోడ్లపాలు చేసింది. ఇంటి పెద్దలను కడుపున పెట్టుకుంది. అదో విషాదం. తీరని శోకం. దీని పీడ విరగడైందని అంతా రొటీన్ లైఫ్లో పడిపోయారు. కానీ అదింకా వెంటాడుతూనే ఉంది. జీవితాల మీద, జీవన ప్రమాణాల మీద దాని ప్రభావం అంతా ఇంతా లేదు. ఎక్కడ చూసిన రేట్లు భగ్గుమంటున్నాయి. మూలిగే నక్కమీద తాటికాయపడ్డట్టు. చేసేందుకు పనులు లేవు.. ఉద్యో్గాలు ఎడాపెడా పీకేశారు. కొత్త ఉద్యోగాల్లేవు. కూలీ పనులూ లేక ఇబ్బందులు పడే పరిస్థితి. రియల్ రంగం కుదేలైంది. దీని మీద ఆధారపడ్డ ఇతర రంగాలూ చతికిలబడ్డాయి. లిక్విడ్ క్యాష్ బయటకు రావడం చాలా తగ్గిపోయింది. రెండు వేల రూపాయల నోట్లు కంటికి కనబడితే ఒట్టు.

ఈ క్రమంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల వాతావరణాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాయి. మధ్యంతర ఎన్నికల కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. అవెప్పుడొస్తాయో తెలియదు కానీ.. ఉప ఎన్నిక మాత్రం ఒకటొచ్చింది. మునుగోడుకు. ఇప్పుడంతా అదే చర్చ. అక్కడే నజర్. దానిపైనే రాజకీయాలు. ఆ నియోజకవర్గం ప్రజలకు మాత్రం ఎన్నికలయ్యే దాకా ఆర్థిక బాధల నుంచి ఉపశమనం. నాలుగు రాళ్లేం ఖర్మా.. రాజకీయ పార్టీల పరిస్థితి చూస్తే కోట్లు కుమ్మరించేటట్టున్నారు. ఒక్కో కుటుంబం కొన్ని వేలన్నా వెనుకేసుకోవచ్చు. ఒక రెండు మూడు నెలల గాసమన్నా వెళ్తుంది. ఇదీ సామాన్యుడి అంతరంగం. మాకూ ఓ ఉప ఎన్నికొస్తే ఎంత బాగుండు… ఇదీ అందరూ అనుకుంటున్న మాట. ఎందుకంటే.. ఉప ఎన్నికంటే అంతే మరి.. అదో పండుగ.
Dandugula Srinivas
