చావు కబుర్లు !

నిన్న కేబీఆర్ పార్క్ లో వాక్ చేస్తుంటే చిరకాల మిత్రుడు ఒకరు కలిశారు . ఆయన ఒక పత్రికకు ఎడిటర్ గా పని చేసారు . ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్నారు.

మా చర్చ కరోనా పేరుతొ మీడియా భయోత్పాతం సృష్టించడం వైపు మళ్లింది . అప్పుడు తాను చెప్పిన కొన్ని విషయాలు .

” ఇది ఇప్పుడు మొదలైన ట్రెండ్ కాదు . 1979 లో స్కైలాబ్ అనేది కూలి పోతుంది అనే వార్తలు వచ్చాయి . ఒక పత్రిక ప్రతి రోజు ఒక కథనాన్ని వండి వార్చేది .

సోమవారం రోజు కథనం – ఇది కచ్చితంగా నెల్లూరు పైనే పడుతుందని శాస్త్రవేత్తలు లెక్కకట్టారు . అంతే … పాపం ఆ ఊరు ప్రజలు భయపడిపోయే వారు .
ఇంకేముంది బతుకు ముగిసిపోతుంది… ఆ రాత్రికి యేట‌లు తెగేవి . చచ్చే ముందు ఎంజాయ్ చేద్దామని డిన్నర్ లు… కోలాహహలం .

బుధవారం : అబ్బే నెల్లూరు కాదు .. నల్గొండ అని శాస్త్రవేత్తల తాజా అంచనా అని కథనం . ఇక నల్లగొండ లో హడావుడి .

రెండు రోజులకు రాజమండ్రి .. అటు పై గుడివాడ .. ఒంగోలు .. వరంగల్

ఇలా ఒక్కో ఊరు ను హడలెత్తించింది. ఇలాంటి వాటిని ఒక పుస్తక రూపం లో రాసే ప్రయత్నం చేస్తున్నాను ” ఇదీ మిత్రుడు చెప్పిన కొన్ని మాటలు . { ఇంకా బోలెడు రాజకీయ కబుర్లు }

చావు పేరుతొ జనాల్ని భయపెట్టే మీడియా క్రీడ 43 ఏళ్ళనాడే తెలుగు నాట జరిగిందన్న మాట !

ఏదో రష్యా యుక్రెయిన్ చావు కబుర్లు ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతే నాలుగో వేవ్ , అందులో ఎంత మంది చచ్చిపోతారు , ఎన్ని రోజులు లాక్ డౌన్ ఉంటుంది .. వీధికి , ఇంటికి ఎన్ని శవాలు లేస్తాయో గ్రాఫిక్స్ తో సహా చూపించి ఉండేవారు .

మీడియా ను నిందించి లాభం లేదేమో ! జనాలు అలాంటి వార్తల్నే నమ్ముతారు . వైరల్ చేస్తారు . వారికి కావలసింది అదే .

Amarnath Vasireddy

You missed