టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ గ‌త కొంత‌కాలంగా వైరాగ్యంలో మునిగిపోయారు. అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నారు. త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని. ఎంత చేసినా క‌నీస గుర్తింపు లేద‌ని. స్వ‌చ్చంధంగా టీఆర్ఎస్ పార్టీ కోసం, అధినేత కోసం ఎంత పోరాడినా… బీజేపీని ఎంత చీల్చి చెండాడినా గుర్తింపు లేని చోట ఈ త్యాగాలెందుకు? అనే అంత‌ర్మ‌థ‌నంలో ప‌డి కొట్టుకుపోతున్నారు టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌. హార్డ్ కోర్ ఫ్యాన్స్‌, సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు సైతం పార్టీ నేత‌ల వైఖ‌రిపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

మొన్న‌టి హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో మాత్రం వీరి సేవ‌ల‌ను మంచిగా వినియోగించుకునేందుకు అంద‌రినీ హ‌రీశ్‌రావు పిలిపించి మీటింగు పెట్టాడు. ఆ ఎన్నిక‌లో గెలుపు కోసం ఆయ‌న అలా వారిని ఉప‌యోగించుకున్నాడు. కానీ గెలుపు సాధ్య‌ప‌డ‌లేదు. హ‌రీశ్‌రావు నిమిత్త మాత్రుడు. ఆ త‌ర్వాత వారియ‌ర్స్ గొంతెమ్మ కోర్కెలు తీర్చ‌డం కానీ, వారిని గుర్తించడం కానీ అత‌ని వ‌ల్ల అయ్యే ప‌ని కాదు. అందుకే అలా గాలికి వ‌దిలేశాడు. స‌రే, వారికి హ‌రీశ్ మీద కోపం లేదు కానీ, కేటీఆర్ ఎందుకు త‌మ‌ను విస్మ‌రిస్త‌న్నాడ‌ని ఎంతో త‌ల్ల‌డిల్లుతున్నారు పాపం.

అప్ప‌డెప్పుడో విర‌గ‌బ‌డండి.. తిట్ల‌తో చంపండి.. ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే అని పిలుపునిచ్చి ఆ త‌ర్వాత క‌నిపించ‌లేదు. ఇలా అవ‌స‌రానికి వాడుకుని వ‌దిలేసే ర‌కాలే ఇవ‌న్నీ అనే క‌చ్చిత‌మైన అభిప్రాయానికి వారొచ్చిన‌ట్టున్నారు. అందుకే ఫేస్‌బుక్కులో త‌మ వాల్‌పై త‌మ అసంతృప్తిని, వైరాగ్యాన్నీ వెళ్ల‌గ‌క్కుతున్నారు. శాప‌నార్ధాలు కూడా పెడుతున్నారు. మీరు బాగుప‌డ‌ర్రోయ్.. మీ గ‌తి ఏమ‌వుతుందో చూసుకోండ్ర‌రేయ్… అని కూడా తిట్ల దండ‌కం అందుకుంటున్నారు. కొంద‌రైతే క‌విత‌క్క‌కు ఈ బాధ్య‌త ఇవ్వండి.. ఆమె చూస్కుంటుంది.. రామ‌న్న‌తో కాదు గానీ అని తేల్చేస్తున్నారు.

You missed