పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఫ్రస్టేషన్ ఎక్కువైపోయింది. మొన్నామధ్య కేటీఆర్ కూడా కంట్రోల్ తప్పి తిట్టాడు కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులని. మరీ హద్దులు మీరుతున్నావ్ కేటీఆర్… అనిపించింది. కానీ వీరి వ్యవహారం, మాటతీరు చూసినంక.. పాపం కేటీఆర్ కంట్రోల్ తప్పడంలో తప్పు లేదనిపిస్తుంది. విమర్శలు హుందాగా ఉండాలి. అవి ప్రజలు కూడా మెచ్చుకునేలా ఉండాలి. అందులో విషయం ఉండాలి. తప్పులను ఎత్తి చూపేవిగా, లోపాలను చూపి కడిగి పారేసేవిగా ఉండాలి. కానీ ఇక్కడ విషయంలేని ఆరోపణలకు అగ్రతాంబూలాలిస్తున్నారు ఈ ఇద్దరు పార్టీ ప్రెసిడెంట్లు.
కేసీఆర్ కుటుంబాన్ని వెలేయాలె.. వారి కుటుంబాలకు పిల్లలనివ్వద్దు.. అని రేవంత్ అనడం అతని ఫ్రస్టేషన్ స్థాయి ఎక్కడి వరకు వెళ్లిపోయిందో తెలియజేస్తున్నది. ఇలా విమర్శిస్తే తప్ప ప్రజలు ఓన్ చేసుకోరని అనుకుంటున్నట్టున్నాడు రేవంత్. బహుశా అర్వింద్ చూపిన బాటలో నడిస్తే తొందరగా క్లిక్ అవుతాననుకున్నాడేమో. తీన్మార్ మల్లన్నలా తిట్ల దండకం అందుకుంటే మెజారిటీ ప్రజలు తనకు మద్దతు పలుకుతారనీ భావించాడేమో తెలియదు. కానీ, రేవంత్ మాటతీరు మాత్రం హుందాగా లేదు. వ్యక్తిగతంగా తిట్టి, మానసికంగా ఇబ్బంది పెట్టి తద్వారా పైశాచికానందం పొంది.. చూశారా.. జనులారా ఎలా తిట్టానో.. నాలా తిట్టే మోగోడున్నాడా..? అని ప్రజల మద్దతుకై అంగలార్చేలా రేవంత్ వైఖరి జుగుప్సాకరంగానే ఉంది.
ఎంత తిడితే అంత తనను ఫైర్ బ్రాండ్ అని గుర్తిస్తారనుకున్నట్టున్నాడు. బండి సంజయ్ కూడా తలాతోక లేని విమర్శలు, ఆరోపణలు. చైనాను లాక్కొచ్చి అదేదో కొత్త తిట్టు, విమర్శ కనిపెట్టినట్టు బిల్డప్ ఇచ్చాడు. తలలో సరకులేదని ఇలా మనమే పదే పదే పదిసార్లు నిరూపించుకోవడం తప్పితే ఇలాంటి సత్తువ లేని విమర్శలు చేసి తమ వెలితితనాన్ని ప్రదర్శించడం కాదా…?
