రాజ‌కీయ నాయ‌కులంటే అంతే మ‌రి. జ‌నం ఎలా ఉండాల‌నుకుంటారో.. వాళ్ల‌లా ఉండాలి. వారేం కోరుకుంటారో మ‌న‌ము అదే చేసి చూపాలి. వాళ్ల‌లో క‌ల‌వాలి. వారితో ఉండాలి. వారిలో ఒక‌రిలా మ‌న‌గ‌ల‌గాలి. మ‌న సిద్దాంతాలు, రాద్దాంతాలు తీసుకుపోయి.. వాళ్ల‌కు రుద్దితే త‌న్ని త‌రిమేస్తారు. ద‌గ్గ‌రికి కూడా రానియ్య‌రు. మ‌న మేథావిత‌న‌మంతా వారి ముందు కుమ్మ‌రిస్తే.. పిచ్చోడ‌నుకునే ప్ర‌మాద‌మూ ఉంది.

వాళ్ల‌కేం కావాలో ఆ సంద‌ర్భానికి అది చేయాలి. అసంద‌ర్భ ప్రేలాప‌న‌లు, వేశాలు అక్క‌డ అక్క‌ర‌కు రావు. కొత్త చిక్కులు తెచ్చిపెడ‌తాయి. కొత్త బిచ్చ‌గాడు పొద్దుముఖం ఎర‌గ‌డ‌ని తిట్టిపోస్తారు. న‌వ్వి హేళ‌న చేస్తారు. ఇంత చేసిందీ మీ కోస‌మే క‌ద‌రా స‌న్నాసులూ..!అని ఒక్కోసారి కోపం క‌ట్ట‌లు తెంచుకుంటుంది. కానీ ఆపుకోవాలె. లేదంటే వాళ్ల కోపానికి నీవు కాలిపోగ‌ల‌వు. ఎందుకురా పిచ్చి వెధ‌వ‌ల్లారా..! మీరంతా ఇలా ఉన్నారు..? అని గొంతెత్తి అర‌వాల‌నిపిస్తుంది. కానీ అలా అర‌వ‌కు. ఎందుకంటే నువ్వే పెద్ద పిచ్చోడివ‌వుతావు. వాళ్ల ద‌గ్గ‌ర‌కు నువ్వు పోయావా? నీ ద‌గ్గ‌రికి వాళ్లొచ్చారా?? అది గుర్తుంచుకుని మ‌స‌లుకో.

దేవుడు లేడు.. దెయ్యం లేడు అని ఒక‌ప్పుడు అన్నావ్‌. అంటే అన్నావ్‌. ఇప్పుడ‌న‌కు. ఎందుకంటే జ‌న‌మంతా దేవుళ్ల చ‌ట్టూ తిరుగుతారు. దెయ్యాలంటే హ‌డ‌లిచ‌స్తారు. వారిన‌లాగే ఉంచు. దేవుళ్ల ద‌గ్గ‌ర‌కు పోయిన‌ప్పుడు చేతులు లేవ‌కున్నా.. బ‌లవంతంగానైనా చేతులు జోడించి .. మొక్కిన‌ట్టు న‌టించు. ప్ర‌సాదాన్ని క‌ళ్ల‌క‌ద్దుకో. తీర్థాన్ని గ‌ర‌ళంలా గొంతులో దింపు. త‌ప్ప‌దు. నువ్విప్పుడు ప్ర‌జాక్షేత్రంలో ఉన్నావు. వాళ్ల న‌జ‌ర్‌లో ప‌డాలంటే ప‌గ‌టేశాలెయ్యాలె. నాట‌కాలాడాలె. వాళ్ల మ‌నిషివి అనిపించుకోవాలె.

రాజ‌కీయాలంటే అంతే సారు. మ‌నం మ‌న‌లా ఉండొద్దు. వాళ్ల‌లా ఉండాలె. క‌లిసిపోవాలె. నీతులు చెప్ప‌డం ఆపాలె. సూక్తులు విన‌డం నేర్వాలె. మేథావిత‌నం క‌ట్టిపెట్టాలె. ఏం తెల్వ‌నివాడిలా తెల్ల‌ముఖం వేసుకుని అమాయ‌కంగా న‌టించాలె. అవ‌స‌ర‌మైతే నాట‌కాలాడాలె. ప్ర‌జ‌ల మ‌న‌సు గెల‌వాలె. అప్పుడే నువ్వు గెలిచేది. లేదంటే గేలి చేసి గెంటేస్తారు.

You missed