నిజామాబాద్ అర్బన్ బీజేపీలో అంతర్గత పోరు ముదురుతోంది. సీనియర్ లీడర్ యెండల లక్ష్మీనారాయణను జిల్లా రాజకీయాలకు దూరం చేసే ఎత్తుగడలో భాగంగానే బాన్సువాడకు పంపారని ఆయన, ఆయన వర్గం నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై గుర్రుగా ఉన్నారు. ఆనాడు డీఎస్ పీసీసీ చీఫ్ హోదాలో తనకు పంటి కిందరాయిలా మారిన బాజిరెడ్డి గోవర్దన్‌ను బాన్సువాడకు పంపి చేతులు దులుపుకున్నట్టే… ఇక్కడ కొడుకు అర్వింద్ కూడా తన తండ్రి మంత్రాన్నే పటించాడు.
కానీ బాజిరెడ్డి మాస్ లీడర్‌గా గెలిచి నిలిచాడు. ఇది భాయ్‌సాబ్‌కు సాధ్యమయ్యే పనికాదు. ఓటమి తప్పదు. దీంతో జిల్లా రాజకీయాలకు క్రమంగా తనను దూరం చేయాలనే ఎత్తుగడ ఉందని గమనించారు. దీంతో అర్వింద్ అనుచరగణాన్ని ఓడించాలని భావిస్తున్నారు. ప్రధానంగా గుండెకాయలాంటి అర్బన్‌లో పార్టీ క్యాండిడేట్ గెలిస్తే షాడో ఎమ్మెల్యేగా అర్వింద్ అధికారం చలాయించుకుంటాడనే కోపంతో బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారయణను ఓడించాలని కంకణం కట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ధన్‌పాల్ సూర్యనారాయణ అంటే వాస్తవంగా బీజేపీ సీనియర్ నేతలకు, కరుడుగట్టిన కార్యకర్తలకు పడదు.
ఆనాడు తనకు టికెట్ రాలేదని బీజేపీ కార్యాలయంపై తన అనుచరులతో రాళ్ల దాడులు చేయించాడు. ఇది పార్టీ సిద్దాంతానికి పూర్తి విరుద్దం. కానీ అర్వింద్ అతన్ని చేరదీసి ఇవాళ టికెట్ ఇప్పించుకుని భాయ్‌సాబ్‌ను జిల్లా రాజకీయాల నుంచి కనుమరుగు చేశాడనే తీవ్ర ఆగ్రహంతో కొంతమంది నాయకులు, కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారు. ఈ పరిణామం ఏ పార్టీకి ఉపయోగపడుతుందో గానీ, బీజేపీకి మాత్రం అంతర్గత అసమ్మతి తీవ్ర నష్టాన్నే మిగల్చనుంది.