అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య హై రేంజ్ వార్ నెలకొన్నది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల అభ్యర్థుల మధ్య పోరు ఒక ఎత్తైతే.. కవిత అరవింద్ మధ్య పోరు మరో ఎత్తులా పరిస్థితి మారిపోయింది. తమ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకొని, ప్రత్యర్థిని రాజకీయంగా దెబ్బకొట్టాలని పట్టుదలతో ఇద్దరు ఉన్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తమ భుజాలపై వేసుకొని పై చేయి సాధించేందుకు ఇద్దరూ సర్వశక్తులు ఒడ్డేందుకు రెడీ అయ్యారు.
కల్వకుంట్ల కవిత.. ధర్మపురి అరవింద్ మధ్య ఐదేండ్లుగా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్నది. విమర్శలు , ప్రతి విమర్శలు పదునైన మాటలతో ఇద్దరి మధ్య ఇక నువ్వా నేనా తేల్చుకుందాం అనేదాకా పరిస్థితి వెళ్ళింది. ఈ క్రమంలో ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలే మరోసారి తలపడనున్నారని అంచనాలు కొంతకాలం కొనసాగాయి. అటు తర్వాత అరవింద్ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆర్మూర్ లేదా కోరుట్ల, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగనున్నారనే ప్రచారం మొదలైంది. పార్లమెంటుకు పోటీ చేసినా, ఎక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేసినా వెంటపడి మరి ఓడించి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటానని కవిత బహిరంగంగా సవాల్ విసిరారు.
ఇటు బిజెపిలో కీలక నాయకుడిగా ఉన్న అరవింద్ సైతం మొదటి నుంచి నిజామాబాద్ జిల్లాపై.. పార్లమెంటు నియోజకవర్గం పై తన బిజెపి పార్టీలో పైచేయి సాధిస్తూ వస్తున్నాడు. పలు నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికే బిజెపి టికెట్లు కూడా సాధించుకున్నారు. ఆయన కూడా కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. తాను గెలిచి తన పార్టీ అభ్యర్థులను సైతం గెలిపించుకొని బిజెపినీ భవిష్యత్తులో కీలక స్థానానికి చేరే స్కెచ్ లో అరవింద్ ఉన్నాడు. ఇందుకోసం సొంత పార్టీలో కీలక నేతలతో సైతం కయ్యాలకు అరవింద్ వెనుకాడ లేదు. ఒక దశలో బిజెపిలో కీలక నాయకులకు సైతం టికెట్ రాకుండా అడ్డుకొని మరి తనవారికి టికెట్లు ఇప్పించుకున్నాడు. ఈ ఎక్సర్‌సైజులో అరవింద్ గెలవకపోతే కెరీర్ జీరో అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఎమ్మెల్యేగా విజయం సాధించలేకపోతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ దక్కకపోవచ్చు అని చెప్పవచ్చు. ఓటమి ఎదురైతే తన పొలిటికల్ లైఫ్ స్మాష్ అవుతుందని, ఇబ్బందుల్లో పడుతుందని తెలిసి కూడా ఈ బాధ్యత అంతా భుజాన వేసుకున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో అవతల టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అరవింద్ ను ఓడించే పట్టుదలలో కల్వకుంట్ల కవిత ఉన్నారు . అరవింద్ ను అరవింద్ టీం ను ఓటమిపాలు చేయకపోతే రాజకీయంగా కవితకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో అరవింద్ టీం ఓటమి లక్ష్యంగా అన్ని అస్త్రాలను కవిత సంధించడం ఖాయం. వీరిద్దరి మధ్య వార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరికి భవిష్యత్తులో విజయ సోపానాలు అందించనుండగా ఇంకొకరికి అపజయాల బాటను చూపనున్నది. ఇదంతా ఈ నేతలు ఇద్దరికీ తెలిసినా తగ్గేదేలే అనే రేంజ్ లో పోరాటానికే అడుగు వేశారు. వీరిద్దరి మధ్య సవాళ్లతో మొదలైన వార్ ఎలా సాగనున్నదని.. ఎలా ముగియనున్నదని ఆసక్తికర చర్చ జరుగుతున్నది.