ఇందూరు జిల్లాలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎంపీ అర్వింద్ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో తన మనుషులనే అభ్యర్థులుగా ప్రకటించుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు. ఇప్పటికే ప్రకటించిన ఐదుగురు అభ్యర్థులు ఆయన సూచించిన నాయకులే. అర్బన్ నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ పైడి రాకేశ్‌రెడ్డి, బాల్కొండ ఏలేటీ అన్నపూర్ణమ్మ, జగిత్యాల భోగ శ్రావణి, కోరుట్ల ఎంపీ అర్వింద్…. బోధన్, రూరల్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు పెండింగ్‌లో పెట్టారు. నిజామాబాద్ రూరల్ నుంచి కులాచారి దినేశ్ పేరు దాదాపుగా ఖరారైంది. కానీ సీనియర్ బీజేపీ లీడర్ యెండల లక్ష్మీనారాయణకు రూరల్ ఇద్దామని అధిష్టానం భావించింది.
దీన్ని అర్వింద్ అడ్డుకున్నాడు. ఇద్దరికి మధ్య సయోధ్య లేదు. చాలా గ్యాప్ ఉంది. దీంతో యెండలను, ఆయన వర్గాన్ని ఆది నుంచి పార్టీలో ఎదగకుండా చేశాడు అర్వింద్. కానీ ఎన్నికల వేళ సీనియర్ లీడర్‌కు అవకాశం ఇవ్వకపోతే ఎలా..? అని అధిష్టానం భావించింది. రూరల్‌ను సెలెక్ట్ చేసింది. ఆఖరి నిమిషంలో అర్వింద్ దీన్ని అడ్డుకుని.. అధిష్టానానికి ఓ విన్నపం చేసుకున్నాడు. ఏడు నియోజకవర్గాల్లో తను సూచించిన లీడర్లకే టికెట్లు ఇస్తే క్లీన్ స్వీప్ చేయిస్తానని, అసెంబ్లీకి తీసుకువస్తానని చెప్పాడట. ఈ సారికి తన నిర్ణయం మేరకే అభ్యర్థులను ప్రకటించాలని కోరాడట. దీంతో అధిష్టానం యెండల అభిప్రాయాన్ని కోరగా.. యెండల అర్వింద్‌కు చెక్ పెట్టేలా… తనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే పార్లమెంటు సీటు కావాలన్నాడట. దీంతో అధిష్టానం కూడా సరేనన్నదని ఆ పార్టీ వర్గాలు చెబుతన్నాయి.