మంత్రి కేటీఆర్‌ హితోపదేశం చేశారు. స్వయంగా గులాబీ దళపతి, ఉద్యమ నేత వచ్చి కామారెడ్డిలో పోటీ చేస్తుంటే.. ఇక్కడ నేతలు గ్రూపులు కట్టి.. ఎవరికి వారే ఉండటాన్ని గమనించిన కేటీఆర్‌ .. ఏకంగా బహిరంగ సభనే పెట్టి నేతలకు చురకలంటించారు. కర్తవ్యబోధ చేశాడు. అహంకారం, అలకలు వీడాలని గట్టిగా చెప్పాడు. అప్రమత్తంగా ఉండకపోతే ఇజ్జత్‌ పోతదనే రీతిలో వారిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. గెలుపు ఖాయమైందని ఎవరికి వారు ఇండ్లలో కూర్చోవద్దని, కాంగ్రెస్‌, బీజేపీలకు తక్కువ అంచనా వేయొద్దని గుర్తు చేశాడు. ప్రతీ ఊరుకి ఒక మ్యానిఫెస్టో తయారు చేయాలని, మొత్తంగా కామారెడ్డి నియోజకవర్గానికే ఓ ప్రత్యేక మ్యానిఫెస్టో తెచ్చి వాటిని అమలు చేసే బాధ్యత తనదని కేటీఆర్‌ కామారెడ్డి వేదికగా ప్రకటించాడు. ప్రతీ ఓటుకు ముగ్గురం ముందుండి వారికి కావాల్సినవి చేస్తామన్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతీ లబ్దిదారుల ఇళ్లలోకి వెళ్లి కేసీఆర్‌ సందేశాన్ని లెటర్‌ రూపంలో వారికిచ్చి ఓట్లు అడగాలని ఆ బాధ్యతను మంత్రి ప్రశాంత్‌రెడ్డి, లోకల్‌ ఎమ్మెల్యే గంప గోవర్దన్, బీఆరెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని .. దేశం యావత్తు కామారెడ్డి వైపు చూస్తున్నదని, రేపు ఇక్కడ భారీ మెజారిటీ వస్తేనే మహారాష్ట్రలో పోటీకి ముఖం చెల్లుతుందని కేటీఆర్‌ వారికి హితోపదేశం చేశాడు. దక్షిణ భారత దేశంలోనే కేసీఆర్‌ మూడో సారి సీఎం అయి చరిత్ర సృష్టించబోతున్నారని, కామారెడ్డి నుంచి ఎంతటి భారీ మెజారిటీ ఇస్తే అంతలా దేశంలో మన పేరు మారుమోగిపోతుందని తెలిపారు. అలకలు, నారాజ్‌లు వదలాలని, అందరినీ కలుపుకుని పోవాలని ఎమ్మెల్యే గంపకు స్టేజ్‌ మీద నుంచి క్లాస్ తీసుకున్నాడు కేటీఆర్‌. ప్రతీ బూతుకు ఒక ఇంచార్జిని నియమించాలని, సీనియర్‌ కార్యకర్తలు, నాయకులు చాలా మంది ఉన్నారని, వారందరి సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

You missed