భీంగల్:
తెల్లారితే కేసిఆర్ ను విమర్శించే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి,బీజేపీ కిషన్ రెడ్డి కేసిఆర్ కాలి గోటికి సరిపోరని మంత్రి వేముల ఘాటుగా వ్యాఖ్యానించారు. మాటలు తప్పా..వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో ఏం చేసింది లేదనీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పైరవికారులదే రాజ్యం అయిందని ఇప్పుడాగోస లేదన్నారు. రైతు బంధు,రైతు భీమా,కళ్యాణ లక్ష్మి,ఆసరా పెన్షన్లు,ప్రత్యేకంగా బీడీ పెన్షన్లు,కేసిఆర్ కిట్,సంక్షేమ పథకాలు,సి.సి రోడ్లు,బిటి రోడ్లు మీ కళ్లముందు కనిపిస్తున్నాయని ఇవే వాస్తవాలు అని కాంగ్రెస్ చెప్పెటేవి అన్ని అబద్ధాలు,అసత్యాలు ఓట్ల కోసం మభ్యపెట్టే మాటలని అన్నారు. ప్రతి పక్షాల మోసపు హామీల మాయలో పడి తినే పళ్ళెంలో మన్ను పోసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలంలో సుమారు 24 కోట్ల విలువైన పనుల శంకుస్ధాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఆదివారం పాల్గొన్నారు.
నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనేది సీఎం కేసిఆర్ ధ్యేయమని మంత్రి వేముల పునరుద్ఘాటించారు. దేశంలోనే ఎక్కడా పేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం లాంటిది లేదన్నారు. అర్హులైన పేదవారికి పూర్తి ఉచితంగా ప్రభుత్వమే 100 శాతం సబ్సిడీతో ఇల్లు కట్టించి ఇస్తుందని తెలిపారు. పైరవీకారుల ప్రమేయం లేకుండా…లబ్ది దారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగిందన్నారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇయ్యలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. దమ్ముంటే కాంగ్రెస్,బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వారు ఇచ్చే హామీలు అమలు చేసి ప్రజలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ&వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డా. మధు శేఖర్,అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.