బాల్కొండ:
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు చందమామ కథలు చెప్పి మభ్యపెట్టి మోసం చేస్తాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈరెండు పార్టీల మాటలు వినొద్దన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ,ముప్కాల్ మండలాల్లో ఆదివారం పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాన కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్,బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేదని,ప్రజలకు ఏమీ కావాలో కనీస అవగాహన కూడా లేదన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎన్నో చందమామ కథలు చెప్పి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక్కడ గెలిస్తే 4వేలు పెన్షన్ ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మొన్ననే కర్ణాటక లో గెలిచింది కదా అక్కడ ఎందుకు 4వేల పెన్షన్ ఇవ్వట్లేదని ప్రశ్నించారు. 200 ఉన్న పెన్షన్ 2వేలు చేసింది కేసిఆర్ అని,కాంగ్రెస్ అబద్ధపు హామీలు నమ్మొద్దని అన్నారు. ఎద్దు..ఎవుసం మీద అవగాహన లేని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కేసిఆర్ ను విమర్శిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ చాలు అని రైతును మళ్ళీ గోస పెట్టే మాటలు చెప్తున్న రేవంత్ ఎక్కడ..? రైతులకు కరెంట్ బాదే ఉండొద్దని వ్యవసాయానికి పుష్కలంగా 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్న కేసిఆర్ ఎక్కడా అని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఎంపి అరవింద్ పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసి గెలిచి ఆయన ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ది ఏంటో చెప్పాలని నిలదీశారు. మాటలు చెప్పడం కాదు..అభివృద్ది చేసి చూపాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో ఒక యజ్ఞంలా అభివృద్ది జరుగుతుందని,కేవలం కేసిఆర్ గారి వల్లే తెలంగాణ సుభిక్షం అయ్యిందన్నారు. ఎప్పటికైనా కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, ప్రజలంతా మంచి చేసిన కేసిఆర్ కు మద్దతుగా నిలవాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.