ఓ సారి కాలం కలిసివచ్చింది. ఆ తరువాత వాస్తవం ప్రజలకు అవగతమైంది. కానీ అదే ఊహాలోకంలో విహరిస్తే.. తనకు తిరిగే లేదనే అహంకారం మితిమీరితే… ఓటమి తప్పదు. నేల విడిచి సాము చేయడం ఆపేశాడు ఎంపీ అర్వింద్‌. వాస్తవం తెలుసుకున్నాడు. మొన్నటి వరకు అసెంబ్లీకి పోటీ చేస్తే అవలీలగా గెలుస్తానని మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించిన ఎంపీ అర్వింద్‌.. ఇప్పుడు దరఖాస్తు కూడా చేసుకోలేదు. కానీ కోరుట్ల నుంచి మాత్రం పోటీ చేయాలని ఆశ మాత్రం చావలేదు. పైకి మాత్రం అధిష్టానం అంటూ ఏవో తప్పించుకునే మాటలు మాట్లాడినా… అసెంబ్లీకి పోటీ చేసినా ఓడిపోతాననే భయం పట్టుకుంది ప్రస్తుతానికి.

ఆర్మూర్‌ ఈజీగా ఉంటుందని లెక్కలు వేసుకున్న అర్వింద్‌ అక్కడ నుంచి కూడా పోటీకి సిద్దంగా లేడు. కోరుట్ల నుంచి పోటీ చేస్తానని మాత్రం తన సన్నిహితుల వద్ద చెబుతున్నాడట. ‘కే’ అనేది తన అదృష్ట అక్షరంగా కూడా చెప్పుకుంటున్నాడట. కానీ అక్కడ పోటీ అంత ఈజీగా లేదు. గెలుపు తీరాలకు చేరడం గగనమే అనేది తేటతెల్లమైంది. దీంతో పార్లమెంటే గతి అని అనుకున్నా.. జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో తాము గెలిచే స్థానాలు ప్రస్తుతం కనుచూపు మేరలో కనిపించడం లేదు. కేవలం మోడీ మేనియా గెలిపిస్తుందా..? అంటే అదీ డౌటే. అందుకే కొత్తగా పసుపు బోర్డు ప్రచారం మొదలు పెట్టించినా.. అది తిరగబడింది.

రైతుల్లో ఆగ్రహమే పెల్లుబుకింద తప్ప అర్వింద్‌ మాటలు, ప్రచారం, హామీలపై నమ్మకం పోయిందెప్పుడో జనాలకు. దీంతో కోరుట్ల లో పోటీ చేయడం కోరికగా ఉన్నా చేయలేని పరిస్థితి… పార్లమెంటుకు పోటీ అంటే పలాయనం చిత్తగించిన చందంగా వెనుదిరగాల్సిన పరిస్థితి… ఏమి చేయాలో పాలుపోక తన రాజకీయ భవితవ్యంపై అయోమయంలో పడిపోయాడు ఎంపీ. మరోవైపు సీనియర్‌ లీడర్‌ యెండల లక్ష్మీనారాయణ నిజామాబాద్‌ ఎంపీ బరిలో ఉంటాడనే ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా అతనూ ప్రయత్నాలు చేస్తున్నట్టు అతని అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి మాత్రం తన సోదరుడి కుమారుడు యెండల సుధాకర్‌తో దరఖాస్తు మాత్రం చేయించాడు.

You missed