ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు లైమ్‌లైట్‌లో ఉన్న నేత. ఇందూరు జిల్లాలో రాజకీయాలన్నీ ఆమె చుట్టే తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ఆమె నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా పనిచేసేందుకు కదన రంగంలోకి దూకారు. ఎప్పుడైతే సీఎం కేసీఆర్‌ సిట్టింగులకు సీట్లు ప్రకటించారో.. కామారెడ్డి నుంచి తను పోటీ చేస్తున్నట్టు డిక్లేర్ చేశారో.. ఇక ఆమె బాధ్యత మరో నాలుగు నియోజకవర్గాలకు పెరిగింది. ఇప్పుడు టార్గెట్‌ 9 నియోజకవర్గాల గెలుపు. ఉమ్మడి జిల్లా క్లీన్‌ స్వీప్‌. అంతే ఆమె దూకుడు పెంచారు. సోమవారం ఒక్కరోజే ఆమె ఏడెనిమిది గంటలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యారంటే ఎంత బిజీగా ఫోకస్‌ పెట్టారో అర్థం చేసుకోవచ్చు.

కామారెడ్డిలో ప్రెస్‌మీట్‌ నుంచి మొదలుకొని.. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్‌పల్లి మండలంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పలు ప్రోగ్రాంలలో ఆమె యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్‌ను ఉతికి ఆరేశారు. తనదైన శైలిలో ఆమె ప్రసంగం కొనసాగింది. ఒకటే టార్గెట్‌ ఊపులో ఉన్న కాంగ్రెస్‌ను ఉతికారేయాలి. హవా తగ్గిన బీజేపీని బొంద పెట్టాలి. ఆ దిశగానే ఆమె పయనం సాగుతున్నది. మూడు గంటల కరెంటు నుంచి మొదలుకొని, బీజేపీ రైతు సదస్సుల వరకు ఆమె సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఈమే లైమ్‌లైట్.

మెగాజాబ్‌ మేళాలను నిర్వహిస్తూ ఆమె నిజామాబాద్‌ యువతలో మరింత క్రేజ్‌ పెంచుకున్నారు. ఈ జాబ్‌మేళాల నిర్వహణకు పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి ఆమె నిజామాబాద్‌కు రప్పిస్తున్నారు. ఇందూరు యువతకు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. నేడు జరిగే జాబ్‌మేళాకు సంబధించిన ఏర్పాట్లపై యువనేత బాజిరెడ్డి జగన్‌తో కలిసి ఆమె పర్యవేక్షించారు. ఇలాంటి జాబ్‌మేళాలతో రాజధానిలో మంచి జాబ్‌లు ఇప్పించే పనిలో ఆమె చేస్తున్న కృషి మంచి ఫలితాలనే ఇస్తున్నాయి.

You missed