ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం నుంచి రానున్న శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసియారే పోటీలో నిలబడటంతో ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ పార్టీకి వెయ్యేనుగుల బలం వచ్చినట్లు అయింది. 10 సంవత్సరాల సుదీర్ఘ వ్యవధిలో పలు కారణాల చేత విముఖ పరిస్థితులు ఎదురవడం సిట్టింగ్ అభ్యర్థులకు సహజమే. అయినా తమ నియోజకవర్గాల్లో కెసిఆర్ అందించిన భారీ అభివృద్ధి, దేశమంతా ఆసక్తిగా పరిశీలిస్తున్న సంక్షేమ పథకాల ఆసరాతో గట్టెక్క గలమని నమ్మకంతో ఉన్న ఉమ్మడి జిల్లాలోని టిఆర్ఎస్ సిట్టింగులందరూ ఏకంగా అధినేత కెసిఆరే కామారెడ్డి నుంచి బరిలో నిలబడటం ఇక తమ విజయమే తరువాయి అనే ఆనందంలో మునిగిపోయారు. గురి తప్పని వ్యూహం కేసీఆర్ ది అనేది అందరికీ తెలిసిందే. కామారెడ్డి బరిలో నుంచి దిగడం వెనక కెసిఆర్ పదునైన విజయవ్యూహం ఉమ్మడి జిల్లాలో అభ్యర్థులందరినీ అలవోకగా గెలుపు తీరాలకు చేర్చే అవకాశాలను కాదనలేమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచి రాష్ట్ర కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత విశ్వసనీయుడిగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గానికి అభివృద్ధిని భారీగానే అందించారు. దీంతో బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డిని ఎదుర్కోవడం ఆషామాషీ కాదనే క్లియర్ కట్ టాక్ ఉంది.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీలో నిలువనున్న టిఎస్ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బలమైన మాస్ లీడర్ గా, తన సామాజిక వర్గం బలగం, బలం ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎక్కడనుండి పోటీ చేసినా గెలిచి రావడం తన ప్రత్యేకతగా పేరున్న బాజిరెడ్డిని ఎదుర్కోవడం రాజకీయాల్లో మహా ఉద్దండులకే సులువు కాలేదని చరిత్ర ఉంది. పైగా రూరల్ నియోజకవర్గం అన్ని విధాల భారీ అభివృద్ధిని అందించారు.

ఆర్మూర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందిన ఆశన్న గారి జీవన్ రెడ్డి కెసిఆర్ కుటుంబానికి గారాబాల శిష్యుడిగా, నియోజకవర్గానికి అభివృద్ధిని అందించిన ఎమ్మెల్యే గానే కాకుండా ప్రత్యర్థులను వె రువకుండా ఎదుర్కొంటాడని పేరుంది.

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం లో మునుపెన్నడూ లేని అభివృద్ధిని నిజామాబాద్ నగరంలో చేసి చూపించాడని పేరు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తకు ఉంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో ఇటీవల ఐటీ హబ్ తో పాటు నగరంలో డ్రైనేజీలు రోడ్లు తదితర సదుపాయాలను గణనీయంగా అభివృద్ధి పరచడంతో పాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సౌమ్యుడిగా పేరు ఉంది.
బోధన్ నియోజకవర్గంలో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి బరిలోకి దిగనున్న షకీల్ కు మైనారిటీ ఓటు బ్యాంకు సొంత బలగం లాంటిది. బోధనను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో అభివృద్ధి పథంలో నిలబెట్టారు. ఇటీవలే బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే షకీల్ నిర్వహించిన పాదయాత్ర ఏకంగా విజయ యాత్ర అనే తలపించి షకీల్ మరో విజయానికి దోహదం చేసింది.

కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభాపతిగా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందిన, మంత్రి పదవుల్లో రాణించిన పోచారం బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథాన ఘనంగా నిలిపారు.

రాజకీయ సుదీర్ఘ అనుభవశాలిగా, లక్ష్మీ పుత్రుడిగా కెసిఆర్, నియోజకవర్గ ప్రజలు పిలుచుకునే పోచారం శ్రీనివాస్ రెడ్డి  గెలుపు నల్లేరుపై నడకే అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు రాజకీయ పరిశీలకులు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జాజాల సురేందర్ ఎమ్మెల్యేగా గెలిచి ఎల్లారెడ్డి అభివృద్ధి వెనుకబాటు ను సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సహకారంతో తొలగిస్తూ వస్తున్నారు.

అభివృద్ధిని చూపించిన ఎమ్మెల్యేగా మరోసారి సురేందర్‌కు విజయ అవకాశాలు ఉంటాయనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. జుక్కల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హనుమంతు షిండేకు ప్రజల్లో చక్కని అభిమానం కనిపిస్తూ ఉంటుంది.

అభివృద్ధిలో వెనుకబాటు కు చిరునామాగా ఉండే జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా చేర్చిన ఘనత హనుమంత్ షిండేది. జిల్లాలో ఏ ప్రాంతం నుంచైనా జుక్కలకు వెళ్లాలన్న.. జుక్కల్ నుంచి జిల్లాలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ముందుగా జుక్కల్ నియోజకవర్గం లోని నరకప్రాయమైన రోడ్లను తలుచుకొని భయపడే వారమని ఆ జిల్లా.. జుక్కల్ ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు చెబుతుండేవారు. జుక్కల్ నియోజకవర్గం లో హనుమంతు షిండే చాలా చక్కగా ఇంజనీరు దృష్టితో రోడ్లు వేయించాడని ఉద్యోగులు ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. అట్టడుగు నుంచి దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన హనుమంతు షిండే తన మూలాలు మర్చిపోకుండా పేదలకు అందుబాటులో ఉంటాడని పేరు ఉంది. ఇలా ఉమ్మడి జిల్లాలో పాజిటివ్ ట్రెండ్ ఉన్న సిట్టింగుల్లో ఇటీవల కాంగ్రెస్ కొంత పుంజుకోవడం ఒకింత టెన్షన్ కలిగిస్తున్నదని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో స్వయంగా కేసీఆరే కామారెడ్డి నుంచి పోటీలో నిర్వహించడం సెట్టింగుల్లో భరోసా నింపింది.

You missed