బీఆరెస్‌ టార్గెట్ డైవర్ట్‌….

బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు షిఫ్ట్‌… కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరగడమూ కారణమే… రేవంత్‌ అనాలోచిత వ్యాఖ్యలతో ప్రజలకు చేరువయ్యేందుకు బీఆరెస్‌కు మంచి అవకాశం..

నిత్యం జనాల్లో ఉండేలా కేసీఆర్‌ ప్లాన్‌… ప్రతిపక్షాలకు ఎదిగేందుకు ఛాన్స్‌ ఇవ్వని వ్యూహాలు…

పదిరోజుల పాటు రైతు సభలతో కాంగ్రెస్‌ ఇక ఉక్కిరిబిక్కిరి… రైతు డిక్లరేషన్‌ ఉత్తదేననిపించేలా ఉద్యమాల ప్రణాళికలు..

రైతుల శ్రేయోభిలాషి పార్టీగా బీఆరెస్సేనని చెప్పేందుకు అన్ని ప్రయత్నాలు…

ఇప్పుడు రాజకీయం రైతుల చుట్టూ….

 

రాజకీయాలు మారాయి. పొలిటికల్ హీట్‌లో మార్పులొచ్చాయి. బీఆరెస్‌ ఇప్పుడు తన టార్గెట్‌ను మార్చింది. ఒకప్పుడు బీజేపీ టార్గెట్‌. దాన్ని ఊపిరితీసుకునే వీలులేకుండా ముప్పేట దాడి చేసిన బీఆరెస్‌.. ఇప్పుడు బీజేపీని కనీసం పట్టించుకోవడం కూడా మానేసింది. కారణం… బీజేపీ గ్రాఫ్‌ గణనీయంగా పడిపోయింది. ఒకప్పుడు మేమే అధికారం అని విర్రవీగిన బీజేపీ… కాలానుగుణంగా వచ్చిన మార్పులు, కొన్ని స్వయంకృతాపరాధాలతో పూర్తిగా వెనుకబడిపోయింది. తన గొయ్యితాను తవ్వుకుంది.

తొలత ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరుతో కవితను అరెస్టు చేస్తామని చేసిన హడావుడి ఓవరాక్షన్‌ ఆ పార్టీ కొంపముంచింది. ఇది ఓ వ్యూహాత్మకమని వారంతా భావించారు. కానీ తమ చాప కిందికే నీరొస్తుందని కనీసం ఊహించలేకపోయారు. ఇది చాలదంటూ మూలిగేనక్క మీద తాటికాయ పడ్డట్టు కర్ణాటక ఫలితాలు గట్టి దెబ్బకొట్టాయి. ఆ తర్వాత కాంగ్రెస్‌ గాలి అంతటా పాకుతూ వచ్చింది. ఏ నలుగురిని కలిసినా ఇదే ముచ్చట. కాంగ్రెస్‌ పుంజుకుంటున్నదని. ఇలా నోటి ప్రచారం కాస్త మూలుగుతున్న పార్టీకి జీవం పోస్తూ వచ్చింది.

ఒకప్పుడు బీజేపీ టికెట్ల కోసం లైన్‌ కట్టి కొట్లాడుకున్న నేతలు, కాంగ్రెస్ వైపు చూడటం ప్రారంభించారు. దీంతో కాంగ్రెస్‌కు అభ్యర్థులే దిక్కులేరనే స్థాయి నుంచి మీరైతే పార్టీలో చేరండి.. సర్వేలో ఎవరికి మైలేజీ వస్తుందో చూసి వారికే టికెట్‌ ఇస్తాం.. అనే రేంజ్‌కు వెళ్లిపోయిందా పార్టీ. ఇదిలా కొనసాగుతున్న తరుణంలో బీఆరెస్‌.. కాంగ్రెస్‌ పై ఫోకస్‌పెట్టింది. దీన్ని నిలువరించేందుకు కత్తులు నూరుతున్న సమయంలో .. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు.. రేవంత్‌ నోటి దూల బాగా కలిసివచ్చింది బీఆరెస్‌. మూడు గంటల కరెంటు చాలు.. ఉచిత కరెంటు అనుచితం అంటూ ఏవేవో పనికిమాలిన, అవగాహన రాహిత్యపు మాటలు మాట్లాడిన రేవంత్‌… ఆ తర్వాత నాలుక్కర్చుకున్నా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. దీన్ని చక్కదిద్దేందుకు ఇంకా ఇంకా తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల వద్ద, రైతుల దగ్గర మరింత పలుచనయ్యాడు రేవంత్‌.

కరెంటు చార్జీలు పెంచొద్దన్నందుకు కాల్పులు జరిపిన ఘటనను కేసీఆర్‌ ఆపాదించే ప్రయత్నం చేసి మరింత బోల్తా పడ్డాడు రేవంత్‌. పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టాడు. దీంతో ఇదే మంచి సమయం.. దొరికిన అద్భుత అవకాశంగా తీసుకున్న బీఆరెస్.. ఏకంగా పది రోజుల నిరసనకు పిలుపునిచ్చింది. సోమవారం నుంచి రైతులతోనే సమావేశాలు ఏర్పాటు చేయాలని భావించింది. రైతు వేదికలను ఈ సభలకు వినియోగిచుకుంటున్నది. రేవంత్‌ తాజాగా రైతులనుద్దేశించి రాసిన లేఖ కూడా పెద్దగా పనిచేయలేదనే చెప్పాలి. ఒక్క రుణమాఫీ చేయదు పార్టీ అనే విషయం తప్ప. బీఆరెస్ తమ పార్టీపై చేస్తున్న ముప్పేట దాడిని ఎదుర్కోవడం కాంగ్రెస్‌ వల్ల అవుతుందా..? ఎన్నికల ముందు చతికిలబడుతుందా..? ప్రజల వద్ద వచ్చిన గాలి నిలుస్తుందా… ?? రేవంత్‌ చేష్టలతో పార్టీ గాలి తీసిన బెలూన్‌ అవుతుందా..? సమాధానాలు త్వరలోనే దొరకనున్నాయి.

You missed